అమరావతి: కాఫర్ డ్యామ్ కట్టడం వల్లే గ్రామాలు మునిగిపోయాయని కొత్తగా పాఠాలు చెబుతున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పరోక్షంగా విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమంటే కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగులు నిర్వహించినంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

 

సోమవారం నాడు చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ టెక్నికల్ కమిటీలు ఉంటాయని ఆయన చెప్పారు.

 

కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారంగానే నిర్మాణాలు జరిగాయని చంద్రబాబు గుర్తు చేశారు.ఇంజినీర్లు, అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి డిజైన్లను అందిస్తారనే విషయాన్ని సదరు మేధావులు తెలుసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. గోదావరికి వరద వచ్చే అవకాశం ఉందని   వరద ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని  రెండు నెలల ముందే పోలీసు, రెవిన్యూ యంత్రాంగాలను అప్రమత్తం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇంతకాలం ఈ మేధావులు ఏం చేశారని  చంద్రబాబు ప్రశ్నించారు.పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని ఆయన వైఎస్ఆర్‌సీపీ నేతలకు చురకలు అంటించారు.తమకు చేతకాని పనిని ఇతరులపై నెపం నెట్టేందుకు  ప్రయత్నించకూడదని ఆయన కోరారు.