చిత్తూరు: షర్మిల చేసిన ఆరోపణలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విషయాలను ఏనాడూ తాము మాట్లాడలేదని చెప్పారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే ...ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని వైసీపీ నేతలను ప్రశ్నించారు.

చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు.వ్యక్తిగత విషయాలపై తాను కానీ, టీడీపీ కానీ ఏనాడూ మాట్లాడదన్నారు. వైసీపీయే ఈ రకంగా వ్యవహరించే సంప్రదాయం ఉందన్నారు. 

షర్మిల టీడీపీపై బురదచల్లే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. షర్మిల చేసిన ఆరోపణలను చంద్రబాబునాయుడు ఖండించారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఏనాడూ కూడ టీడీపీ వ్యవహరించదని ఆయన చెప్పారు.

ఏపీ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకుండా... ఈ రాష్ట్రంలో ఎలా ఉంటారని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ దేశంపై నమ్మకం లేకపోతే వేరే దేశానికి వెళ్లి విచారణ కోరుతారా అని ప్రశ్నించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెబుతున్నవారు ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని బాబు ప్రశ్నించారు.

ఏపీలో ఘటన జరిగితే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని చెప్పాలన్నారు.హైద్రాబాద్ లో నివాసం ఉండే వారు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు.హైద్రాబాద్ లో ఉంటూ ఏపీ పోలీసులకు నమ్మకం లేదని అనడాన్ని బాబు తప్పుబట్టారు.

విశాఖలో జగన్ పై దాడి జరిగితే అక్కడ ఫిర్యాదు చేయకుండానే వెళ్లడం... ఎన్ఐఏ దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడాన్ని కూడ బాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

జగన్ పై దాడి కేసు సమయంలో కూడ ఏపీ పోలీసులపై నమ్మకం లేదని వైసీపీ నేతలు మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఎన్ఐఏ జగన్ కేసును దర్యాప్తు చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం తీసుకోవడాన్ని సీరియస్ గా తీసుకొన్నట్టు చెప్పారు.

షర్మిల కంప్లైంట్ తో నాకేం సంబంధమని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎవరూ కూడ షర్మిల గురించి మాట్లాడలేదన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని ఆయన చెప్పారు. మోడీ, జగన్, కేసీఆర్‌లు కలిశారని నేను చెప్పడమే కాదు పవన్ కళ్యాణ్ కూడ  ఇదే విషయాన్ని చెప్పారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఈ నాలుగున్నర ఏళ్లలో చేపట్టినట్టు ఆయన వివరించారు. చిత్తూరు జిల్లాలో వంద శాతం మరుగుడొడ్లు నిర్మించినట్టు ఆయన తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని .ఆయన తెలిపారు.

రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఉద్యానవన పంటల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తోందని చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీలలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పెన్షన్ల రెట్టింపుతో పేదల్లో ఆనందం రెట్టింపు అయిందన్నారు. పచ్చదనం పెంచేందుకు సర్కార్ అనేక చర్యలు తీసుకొంటుందని బాబు చెప్పారు.

జన్మభూమిలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్టు బాబు తెలిపారు. రానున్న రోజుల్లో ఏపీలోని గ్రామాలు టూరిజం హబ్‌గా మారనున్నాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

సమస్యలను రియల్‌టైంలో పరిష్కరించే పరిస్థితిలో ఉన్నామన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా వంద యూనిట్లు ఇస్తున్నట్టు చెప్పారు.
వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని బాబు తెలిపారు. సంక్రాంతిని చూపుతూ జూదం ఆడడం సరైంది కాదన్నారు.

తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది. తెలంగాణలో జరగని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్టు తెలిపారు. ప్రజలు టీడీపీకి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.