మనిషిని దేవుడితో పోల్చడం సరైందికాదు: రమణ దీక్షితులు వ్యాఖ్యలకు బాబు కౌంటర్
పింక్ డైమండ్ పోయిందంటూ ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి ప్రధాన అర్చకులుగా చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
తిరుపతి: పింక్ డైమండ్ పోయిందంటూ ఆరోపణలు చేసిన వ్యక్తిని తిరిగి ప్రధాన అర్చకులుగా చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
గురువారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలా చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన చెప్పారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతోందని ఆయన తెలిపారు.
రాష్ట్రానికి అతి పెద్ద ఆస్తి వెంకటేశ్వరస్వామి అని ఆయన చెప్పారు.టీటీడీ ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు.
తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మనిషిని దేవుడితో పోల్చడం మంచి పద్దతికాదన్నారు. ఇలాంటి అపచారాలు కూడ గతంలోనూ చేశారని ఆయన మండిపడ్డారు.