అమరావతి: వైసీపీ దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు  ఆదివారం నాడు పార్టీ సీనియర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

సీఆర్‌డీఏ, పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చారు.టీడీపీ అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

కార్యకర్తలకు పార్టీ అండగా ఉందని భరోసా కల్పించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. విదేశీ పర్యటన నుండి  వచ్చిన తర్వాత పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయనున్నట్టు బాబు పార్టీ నేతలకు వివరించారు. ఆదివారం నాడు టీడీపీ సీనియర్లు చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.