అమరావతి: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు..అది నిజమనిపిస్తోంది తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే. తెలుగువారి ఆత్మగౌరం కోసం, కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టేందుకు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తుంటారు. 

తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ పతనం కోసమంటూ అనేక సార్లు చెప్పుకొచ్చారు. అంతలా కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసే చంద్రబాబు అదే కాంగ్రెస్ తో పొత్తుకు తహతహలాడుతున్నారు. అయితే ఈ పొత్తులో కొత్త ట్విస్ట్ ఉందండోయ్. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నై అంటున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ రద్దుతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అన్నిపార్టీలు తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తుండటంతో తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికలకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఒక్కటే సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన పార్టీలు ముందస్తు ఎన్నికలకు రెడీగా లేవనే చెప్పాలి. అయితే ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీనే ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. అస్త్రసస్త్రాలను ప్రయోగిస్తుంది.

కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఇతర పార్టీలతో పొత్తులకు రెడీ అవుతుంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుని ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. టీడీపీ మూడోస్థానానికి పరిమితమైంది. 2014 ఎన్నికల్లో గెలిచిన 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలో కొందరు టీఆర్ఎస్ పార్టీ, మరికొందరు కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్నది ఇద్దరే ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్లే సండ్ర వీరవెంకటయ్య, ఆర్ కృష్ణయ్య. 

టీడీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు జంప్ అవ్వడంతోపాటు పార్టీలో నెలకొన్న రాజకీయ విబేధాలతో  టీడీపీ బలహీనపడింది. ఎంతలా బలహీనపడిందంటే కనీసం అభ్యర్థులు కూడా కరువయ్యే పరిస్థితి. అయితే ఈసారి ఎన్నికల్లో గెలవడం అంటే చాలా కష్టమనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ తెలంగాణలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు రెడీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తాము సిద్ధమే అంటూ కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అంగీకరిస్తున్నచంద్రబాబు నాయుడు ఆపొత్తు ప్రభావం ఏపీలో ఎలాంటి ప్రభావం చూపబోతుందా అని అంతర్మథనం చెందుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుపై మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటేనే ఒంటికాలితో లేస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటే ప్రజలు బట్టలూడేలా తంతారని ఏకంగా సొంతకేబినేట్ లోని మంత్రి అయ్యన్నపాత్రుడే ఘాటుగా విమర్శించారు. 

మరోవైపు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సైతం ఏపీలో కాంగ్రెస్ తో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అయితే తెలంగాణలో పొత్తుపై మాత్రం నోరు మెుదపడం లేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ఆయా ప్రాంతాల్లో రాజకీయాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటూ పరోక్షంగా సమర్ధించుకున్నారు. అంటే కాంగ్రెస్ వ్యతిరేక మూలాలపై పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అదే పార్టీ ఒక రాష్ట్రంలో ఒక రకంగా..మరో రాష్ట్రంలో మరో రకంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  

తెలంగాణలో టీడీపీ ఉనికిని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు తప్పనిసరి. లేకపోతే తెలంగాణలో పార్టీ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు తప్పనిసరి. కాంగ్రెస్ పార్టీ తప్పితే తెలంగాణ జనసమితి, వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చెయ్యాల్సి వస్తుంది. ఆ పార్టీలు పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్ననేపథ్యంలో ఆ పార్టీలో కలిసి వెళ్లేందుకు టీడీపీ నేతలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికంటే ఒంటరిగా బరిలోకి దిగడం బెటరని అయినా గెలవడం కష్టమని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీతో జతకడితే కాస్తో కూస్తో సీట్లు గెలవొచ్చని అభిప్రాయపడుతున్నారు.  

తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీ ఓటు బ్యాంకు బాగానే ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీని కలుపుకుంటే గ్రేటర్ లో తమ హవా చాటొచ్చని కాంగ్రెస్ పార్టీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈనెల 8న సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చించేందుకు రెడీ అవుతుంది. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రెడీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారా అన్న సందేహం చంద్రబాబు నాయుడును వెంటాడుతోంది. రాష్ట్రవిభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేదు. దీంతో పార్టీ అడ్రస్ గల్లంతైంది. చంద్రబాబు నాయుడు సైతం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ద్రోహి కాంగ్రెస్ పార్టీ అంటూ పదేపదే విమర్శించారు. 
అక్కడ పొత్తుకు రెడీ అయి ఇక్కడ వద్దు అంటే ప్రజలు అవకాశవాద రాజకీయాలుగా భావించి తమను ఆదరించరేమోనని ఆలోచిస్తున్నారట. మెుత్తానికి ముందస్తు ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో అన్నది వేచి చూడాలి.