ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం  కొత్తగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం విద్యా విధానంపై సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబుల మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది.

తెలుగు సబ్జెక్ట్ పెట్టండి అంటే నీకెంతమంది భార్యలు అంటారా అంటూ టీడీపీ అధినేత... పవన్ కళ్యాణ్ కు పరోక్ష మద్దతు పలికారు. దీనిపై ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బాబు డిమాండ్ చేశారు.

Also Read:నీకు మానవత్వం లేదు, దేవుడు చూసుకుంటాడులే: చంద్రబాబుపై జగన్ ధ్వజం

దీనిపై స్పందించిన జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు బుద్ధి, జ్ఞానం లేదని.. ప్రతిదానికి సాక్షి పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ ఎలా చూపిస్తారంటూ సీఎం ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే జగన్ చెప్పిన మాట తప్పితే చూపించాలని సవాల్ విసిరారు.  తనను చంద్రబాబు ఉన్మాది అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్తారని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు మానవత్వం లేదనే విషయం అందరికీ తెలుసునన్నారు జగన్. కొంతమంది మనుషులు కరుడుగట్టిన స్వభావంతో ఉంటారుని వాళ్లలో మానవత్వం ఎక్కడా కనిపించదన్నారు సీఎం జగన్. 

మార్షల్స్‌ మీద అన్యాయంగా అభాండాలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. జరగని గొడవను జరిగినట్టుగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు.  జరిగిన ఘటనలను స్పష్టంగా టీవీల్లో చూస్తున్నామని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు చుట్టూ బ్లాక్‌క్యాట్‌ కమాండోలు ఉన్నారని వాళ్లు ఎవ్వరినీ దగ్గరకు రానివ్వరన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. అలాంటి బ్లాక్‌క్యాట్‌ కమాండోలను పెట్టుకుని మార్షల్స్‌ మీద చంద్రబాబు  దౌర్జన్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

Also Read:ఏపీ అసెంబ్లీలో మంత్రి కన్నబాబు, అచ్చెన్నాయుడు మధ్య ఆసక్తికరం

ఉన్మాది అంటూ రెచ్చగొట్టే మాటలను చంద్రబాబు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. మార్షల్స్‌ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అన్యాయంగా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. సభలో రెచ్చగొట్టే మాటలకే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.