అమరావతి: టీడీపీకి చెందిన కాపు  నేతలు శుక్రవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుతో సమావేశం కానున్నారు. ఇటీవలనే 14 మంది కాపు నేతలు  కాకినాడలో సమావేశమయ్యారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై చర్చించారు. కాపు నేతలతో ఆ పార్టీ సీనియర్లు చర్చించారు. దీంతో  వారంతా బాబుతో సమావేశం కానున్నారు.

మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, నారాయణలు కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. కొన్ని విషయాలపై కాపు నేతలు అసంతృప్తితో ఉన్నారు. 

అయితే ఈ విషయాలను చంద్రబాబుతో చర్చించనున్నారు కాపు నేతలు. ఒకరిద్దరూ నేతలు బాబుతో సమావేశానికి దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కానీ, మెజారిటీ నేతలు మాత్రం ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.  

కాకినాడలో జరిగిన కాపు సామాజిక వర్గానికి చెందిన  నేతలు  సమావేశం కావడం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం కాదన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారనే ప్రచారం కూడ సాగింది. అయితే తాము టీడీపీలోనే ఉన్నామని.. పార్టీ మారడం కోసం సమావేశం ఏర్పాటు చేసుకోలేదని  టీడీపీ నేతలు ప్రకటించారు.