అమరావతి:  జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ను విమర్శించవద్దని ఆయన తెలుగుదేశం పార్టీ నేతలను ఆదేశించారు. దీంతో చంద్రబాబు పవన్ కల్యాణ్ దగ్గరవుతున్నారనే సంకేతాలు అందుతున్నాయని అంటున్నారు.

చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం కోల్ కతాలో జరిగిన యునైటెడ్ ర్యాలీపై టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో మాట్లాడారు. మోడీ, కేసీఆర్, జగన్ లపై విమర్శనాస్త్రాలు సంధించాలని ఈ సందర్భంగా నాయకులకు సూచించారు. 

ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ ను విమర్శించవద్దని ఆ ప్రస్తావనకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు. తాను చెప్పింది చేయాలని ఆయన బుచ్చయ్య చౌదరికి చెప్పారు. 

చంద్రబాబు నాయుడిపై కక్ష సాధించేందుకే టీఆర్‌ఎస్‌ నాయకులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్నారని ఇటీవల తెనాలిలో జరిగిన సభలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.  కేటీఆర్, జగన్ ల భేటీని ప్రస్తావిస్తూ చంద్రబాబు - పవన్ కల్యాణ్ చెప్పిందే నిజమైందని వ్యాఖ్యానించారు. పవన్‌ను విమర్శించవద్దంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా చూస్తుంటే పవన్, చంద్రబాబు ఒక్కటవుతున్నారా అనే అనుమానం కలగకమానదు.