Asianet News TeluguAsianet News Telugu

నాపోరాటం ఈసీపై కాదు ఈసీ విధానాలపైనే: చంద్రబాబు

కర్ణాటక, తమిళనాడులో బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలపై ఐటీ దాడులు జరిగాయని అలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయోద్దన్నారు. మోదీ కోసం కాకుండా దేశం కోసం పని చేయాలని ఈసీకి సూచించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. 

chandrababu serious comments on cec
Author
Tirupati, First Published Apr 20, 2019, 8:08 PM IST

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేయాలని చూశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తన పోరాటం ఎన్నికల సంఘంపై కాదని ఈసీ అవలంభించే విధానాలపైనేనని చెప్పుకొచ్చారు.  

తిరుపతిలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏ్పాటు చేసిన రక్త నిధికేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తాను తిరుపతి నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేశారు. 

ఆనాటి నుంచి ఈనాటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని, రాష్ట్రం కోసం నితి, నిజాయితీతో కష్టపడి పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. న్యాయం కోసం రాజీలేని పోరాటం చేశానని జాతీయ స్థాయిలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. 

విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రెండు ప్రాంతాలకూ న్యాయం చేయాలని కోరినట్లు గుర్తు చేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై తిరుపతిలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారని తీరా ఎన్నికల్లో గెలిచాక హామీలను అమలు చెయ్యకుండా ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 

విభజన హామీల సాధన కోసం దాదాపుగా ఏడాదిపాటు ధర్మపోరాట దీక్షలు చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితికి మోదీ దిగజారారని ఆరోపించారు. 

కర్ణాటక, ఒడిషా సీఎంలు ప్రయాణించే హెలికాప్టర్లను ఈసీ అధికారులు తనిఖీ చేశారని కానీ ప్రధాని నరేంద్రమోదీ హెలికాప్టర్ ను తనిఖీ చేసిన అధికారిని మాత్రం సస్పెండ్ చేశారని ఇదేమి వ్యవస్థ అంటూ మండిపడ్డారు. 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఐబీతో సహా ఇతర అధికారులతో ప్రధాని నరేంద్రమోదీ సమీక్షలు నిర్వహిస్తున్నారని కానీ తాను చేస్తే మాత్రం ఎన్నికల కోడ్ అంటూ అడ్డుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 

అందరికీ ఆంక్షలు పెడితే తాను కూడా అనుసరిస్తానని కానీ ఆంక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే ఎందుకు వర్తింపజేస్తున్నారని ఈసీపై మండిపడ్డారు. కర్ణాటక, తమిళనాడులో బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలపై ఐటీ దాడులు జరిగాయని అలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయోద్దన్నారు. మోదీ కోసం కాకుండా దేశం కోసం పని చేయాలని ఈసీకి సూచించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios