విజయవాడ: తన సమీక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం డుమ్మా కొట్టడాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫణి తుఫానుపై చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు కాలేదు. దానిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. 

ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకునే దిశలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అధికారులంతా తనకు రిపోర్టు చేయాల్సిందేనని, అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. 

వచ్చే వారంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అమరావతిలోని ఉండవల్లి ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్వీపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. 

అధికారులు ఎన్నికల కమిషన్ కు రిపోర్టు చేయాలని ఎక్కడా లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు, మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉంటే ఈసీ రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన అన్నారు 

ఈ సిఎస్ మూడు నెలలు మాత్రమే కొనసాగవచ్చు గానీ తాను 22 ఏళ్లు మంత్రిగా పనిచేశానని, ఎన్నో ఎన్నికలను చూశానని, ఇవే తనకు చివరి ఎన్నికలు కూడా కావని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను తనిఖీ చేయడానికి తాను వెళ్తానని ఆయన చెప్పారు.