నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబు క్వాష్ పిటిషన్ నేడు సుప్రీంలో విచారణకు రానుంది. నేడు మెన్షనింగ్ కి రమ్మని సీజైఐ ఆయన తరఫు న్యాయవాదులకు తెలిపారు.

ఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్ పీ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు రానుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే తనపై కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్ఎల్ పి దాఖలు చేశారు. శనివారం నాడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఈ ఎస్ఎల్ పీని వేశారు.
ఏపీ హైకోర్టులో వేసిన తన పిటీషన్ను గత శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్కే శ్రీనివాస్ రెడ్డి కొట్టేయడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీం తలుపు తట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మసనం ముందు సోమవారం ఈ కేసుకు సంబంధించి చంద్రబాబునాయుడు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. ఆయన సుప్రీం ముందు తన వాదనలు వినిపిస్తూ.. చాలా అత్యవసరం ఉన్నందుకే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మెన్షన్ స్లిప్ ఇచ్చామని తెలిపారు.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా: బాబు న్యాయవాదులపై జడ్జి అసహనం
ఇంకా మాట్లాడుతూ.. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేసు.. పిటిషనర్ కస్టడీలో ఉన్నారని, ఏపీలో ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని.. విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వారి అభ్యర్థనలు విన్న సిజెఐ.. ఆయన ఎప్పటినుంచి కస్టడీలో ఉన్నారని ప్రశ్నించారు. వారికి మంగళవారం రండి అని సూచన చేశారు. దీనికి సమాధానంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా 8వ తేదీన ఆయనని అరెస్టు చేసినట్లుగా చెప్పారు.
దీంతో సీజేఐ సెప్టెంబర్ 8 నుంచా? అని ప్రశ్నించారు. రేపటి మెన్షనింగ్ లో రండి.. ఏం చేయాలన్నది చూస్తాం.. అంటూ విచారణను ముగించారు. మరోవైపు ఈనెల 23, 24 తేదీల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను విచారించేందుకు సిఐడికి ఇస్తూ విజయవాడ అవినీతి నిరోధక శాఖ కోర్టు సెప్టెంబర్ 22వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు.
ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు పరిష్కరించింది. ఇప్పటికే పోలీస్ కస్టడీ ముగిసిపోయినందున ఇది నిరర్థకం అంటూ విచారణ మూసేసింది. సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు విచారణ ముగిసింది అంటూ ఉత్తర్వులు ఇచ్చారు.