కుప్పం: పేదరికం లేని సమాజం చూడాలన్నదే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చిత్తూరులో జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు రాష్ట్ర అవతరణ జరుపుకోలేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. అందువల్లే నవనిర్మాణ దీక్షలు జరుపుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. 

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. నెత్తిన అప్పులు పెట్టుకుని అమరావతికి వచ్చామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదన్నారు. 

అలాగవే కేంద్రం పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యడం లేదన్నారు. లోటు బడ్జెట్ పూడుస్తామని చెప్పి ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టడం లేదన్నారు. రాష్ట్రానికి ఇస్తామన్న విద్యాసంస్థలను కూడా ఇవ్వలేదన్నారు.

కేంద్రం సహకరించకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే భారీగా నిధులు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేసే పనిలో పడ్డామన్నారు. 

దేశంలో వ్యవసాయ రంగం 2శాతం వృద్ధిరేటు సాధిస్తే ఆంధ్రప్రదేశ్ 11 శాతం వృద్ధి రేటు సాధించిందని చంద్రబాబు చెప్పారు. అటు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం సైతం వ్యవసాయ రంగంలో 0.28 శాతం సాధించిందన్నారు.