Asianet News TeluguAsianet News Telugu

'బుట్ట' దాఖలే: చినబాబు మాట కూడా వినని చంద్రబాబు

అవకాశమిచ్చిన పార్టీని కాదనుకుంది. అధికార పార్టీకి జై కొడదామని ప్రయత్నించి ఏడాది తిరగక ముందే ఆ పార్టీకి రాం రాం చెప్పిసింది.సైకిలెక్కుదామనుకుంటే అది కూడా బెడిసికొట్టింది. జంప్ అయితే ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనన్న భయంతో దూకకుండా కేవలం టచ్ లో మాత్రమే ఉంటుంది. 

Chandrababu not to hear Lokesh on Butta Renuka
Author
Kurnool, First Published Nov 2, 2018, 6:37 PM IST

కర్నూలు: అవకాశమిచ్చిన పార్టీని కాదనుకుంది. అధికార పార్టీకి జై కొడదామని ప్రయత్నించి ఏడాది తిరగక ముందే ఆ పార్టీకి రాం రాం చెప్పిసింది.సైకిలెక్కుదామనుకుంటే అది కూడా బెడిసికొట్టింది. జంప్ అయితే ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనన్న భయంతో దూకకుండా కేవలం టచ్ లో మాత్రమే ఉంటుంది. తనకు పదవి గండం ఉండటంతో తన భర్తను సైకిలెక్కించి ఆమె మాత్రం టీడీపీ కార్యక్రమాల్లో హుషారుగానే  పాల్గొంటున్నారు. 

అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె పరిస్థితి ఏంటనేదానిపై అంతా అగమ్య గోచరంగా తయారైంది. టీడీపీ తరపున కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుదామని బుట్టా రేణుక మెుదటి నుంచి ప్లాన్ వేస్తూనే వచ్చారు. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల వ్యవహారం అంతా చినబాబు చూసుకుంటున్న నేపథ్యంలో ఆయనతో కూడా సత్సమ సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు లోకేష్ వర్గంలో ఆమె కూడా చేరిపోయారు. లోకేష్ సైతం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మీరే బరిలోకి దిగుతారని బుట్టా రేణుకకు హామీ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఎంపీల పరిస్థితిపై ఆరా తీశారు. సర్వే కూడా చేయించారని ప్రచారం. 

అయితే ఆ సర్వేలో బుట్టా రేణుకకు ప్రతికూల పరిస్థితి ఉందని తేలిందట. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలంతా నోరు విప్పితే తమ పార్టీకి అనుబంధ సభ్యురాలిగా ఉన్న బుట్టా రేణుక మాత్రం పెదవి విప్పలేదని చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. 

కేంద్రంతో అమితుమీకి తేల్చుకున్నప్పుడు రాజకీయం చెయ్యాల్సింది చేయించాల్సింది ఎంపీలతోనేనని భావించిన చంద్రబాబు బుట్టా రేణుకపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఆమె నిత్యం మౌనముని పాత్రను పోషిస్తుందని అది ప్రస్తుత రాజకీయాల్లో సెట్ అవదని అసెంబ్లీకి పంపితే ఎలా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాకుండా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో వివాదాలు పెట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు సైతం చంద్రబాబు దృష్టికి వచ్చాయి.  

ప్రస్తుత ఎంపీల భవితవ్యంపై చంద్రబాబు ఆరా తీసిన సందర్భంలో చినబాబు అలియాస్ లోకేష్ కర్నూలు పార్లమెంట్ స్థానంపై చంద్రబాబుతో చర్చించారు. బుట్టా రేణుకను బరిలో దింపేందుకు చంద్రబాబు అంతగా ఆసక్తి కనబరచలేదు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి వంటి నేతలతో విబేధాలు, కర్నూలు నగర పాలక సంస్థ అభివృద్ధి పనుల విషయంలో ఆమె వ్యవహరిస్తున్న తీరు అన్నింటిపై లోకేష్ తో చర్చించారు చంద్రబాబు.

లోకే ష్ ఒప్పించే ప్రయత్నం చేసినా తనలోని మైనస్ లు చెప్పి చినబాబు మాటను కూడా పక్కన పెట్టేశారట. అంతేకాదు పార్టీ ఆమెను పక్కన పెట్టడం లేదని శాసనసభకు పంపిద్దామని ఓ ఉచిత సలహా ఇచ్చి పడేశారట. అక్కడితో ఆగకుండా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుంది అని కూడా చినబాబును అడిగి చూశారట.  
 
ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బుట్టా రేణుకకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో గనుక టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆమె పరిస్థితి ఇక అంతేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పొత్తు పరిణామాల నేపథ్యంలో కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడు, జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మాజీకేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం. ఒకవేళ పొత్తు ఉంటే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డియే కర్నూలు ఎంపీగా బరిలోకి దించాలని ఆయనకు టీడీపీ ఇవ్వక తప్పాల్సిన పరిస్థితి అని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతుంది.  

ఇప్పటికే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు పార్లమెంట్ స్థానంపై కన్నేశారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తు ఖచ్చితమని ఊహించిన ఆయన టిక్కెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. అంతేకాదు చంద్రబాబు ఢిల్లీ టూర్ పై హర్షం కూడా వ్యక్తం చేశారు. 

చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీతో కలవడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తులతో పోటీ చేస్తే ప్రభంజనమేనన్నారు. కాంగ్రెస్ టీడీపీల ప్రభంజనాన్ని వైసీపీ తట్టుకోలేదని వ్యాఖ్యానించారు. సూర్యప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇక టిక్కెట్ ఆయనకేనని కర్నూలు జిల్లా వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. 

మరోవైపు ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి బుట్టా రేణుకను పోటీ చెయ్యించాలని టీడీపీ భావిస్తోంది. అయితే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బుట్టా రేణుక ఆసక్తికనబరచడం లేదు. అయితే బుట్టా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచే పోటీ చేస్తారని పార్లమెంట్ కు చెయ్యరంటూ ప్రచారం జరుగుతుంది. 

దీంతో బుట్టా రేణుక పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అనుకున్నది ఒక్కటి అయినదొక్కటి అన్న చందంగా ఆమె తలచింది ఒకటైతే చంద్రబాబు తలుస్తుంది మరోక్కటిలా ఉంది. చంద్రబాబు వద్దన్నారు....చినబాబు ఏమీ చెయ్యలేనని చేతులెత్తేశారు, జగన్ తలుపులు మూసేశారు. మెుత్తానికి ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లైంది బుట్టా రేణుక పరిస్థితి. అయితే భవిష్యత్ లో ఆమె పరిస్థితి ఏంటా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios