అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. వీలైనంత విరాళం ఇచ్చిమానవత్వంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపామని, రూ.1200 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరినట్టు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 

తిత్లీ తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని రెండో లేఖలోనూ వివరిస్తూ కేంద్రాన్ని నిధులు కోరామని అయితే ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. కేంద్రం నిధుల కోసమే చూడకుండా ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేసినట్టు తెలిపారు. 

బాధిత కుటుంబాలు నిలదొక్కుకునేందుకు పరిహారం ప్రకటించినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు, ప్రవాసాంధ్రులు, అన్నివర్గాల ప్రజలు ఆపన్నహస్తం అందివ్వాలని చంద్రబాబు లేఖలో కోరారు.