2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కనుక ఓడిపోతే.. రాజకీయంగా కోలుకోవడం అంత తేలిక కాదు. వయసు రీత్యా చంద్రబాబుకు కూడా ఇవే చివరి ఎన్నికలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గనుక అధికారంలోకి రాకుంటే భవిష్యత్‌లో క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వుంటుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎన్నికలపై పడింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అక్కడ ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. వీరిలో అందరికంటే సీఎం జగన్ గేమ్ మొదలుపెట్టేశారు. గెలవరు అనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిర్ధాక్షిణ్యంగా పక్కనపెట్టేయడమో, వారి స్థానాలను మార్చడమో చేస్తున్నారు. బంధువులైనా, ఆప్త మిత్రులైనా సరే జగన్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకుండా నో చెప్పేస్తున్నారు. టికెట్లు కోల్పోయే నేతలను క్యాంప్ ఆఫీస్‌కి పిలిపించి వారిని బుజ్జగించే పనిలో వున్నారు జగన్, ఇతర కీలక నేతలు.
అయితే జగన్మోహన్ రెడ్డి బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నడిస్తే. ఒకరకంగా చెప్పాలంటే జగన్ కంటే చంద్రబాబుకే ఈ ఎన్నికలు చావో రేవో వంటివి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కనుక ఓడిపోతే.. రాజకీయంగా కోలుకోవడం అంత తేలిక కాదు. వయసు రీత్యా చంద్రబాబుకు కూడా ఇవే చివరి ఎన్నికలుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గనుక అధికారంలోకి రాకుంటే భవిష్యత్‌లో క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వుంటుంది. అది తెలిసే చంద్రబాబు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గెలవడానికి వున్న ఎలాంటి అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను దారిలోకి తెచ్చుకుని పొత్తుల ప్రకటన చేయించిన చంద్రబాబు .. బీజేపీని కూడా కలుపుకుపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాలను మచ్చిక చేసుకునేందుకు గాను కర్ణాటక, తెలంగాణలలో సక్సెస్ అయిన గ్యారంటీ పథకాలను హామీలుగా ప్రకటించారు. అలాగే జగన్ బాటలోనే టికెట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు.
గెలవని వారిని, వ్యతిరేకత వున్న వారిని మొహమాటాలకు పోయి ఎవరిని పడితే వారిని అభ్యర్ధులుగా ఎంపిక చేసేది లేదని చంద్రబాబు స్పష్టమైన సంకేతాలిచ్చేశారట. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు టికెట్ల విషయంలో ముందు ఎవరికి ఎస్ చెప్పరు, అలాగని నో చెప్పరు. చివరి వరకు వ్యవహారం నాన్చి అభ్యర్ధుల జాబితాను ప్రకటించడం చంద్రబాబు స్ట్రాటజీ . ఏళ్లుగా ఆయన ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం తన సహజ వైఖరికి భిన్నంగా వ్యవహరించనున్నారు. టికెట్ సంగతి తనకు వదిలేసి నియోజకవర్గాల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని చెబుతున్నారు.
సర్వేల్లో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు కరాఖండీగా చెప్పేస్తున్నారు. గతంలోనూ సర్వేలు చేయించుకునే అలవాటున్నా ఒత్తిళ్లకు లొంగిపోయేవారు. కానీ రాబోయే ఎన్నికలు చావోరేవో వంటి పరిస్ధితి కావడంతో ఎట్టి పరిస్ధితుల్లోనూ లొంగేదిలేదని చెబుతున్నారు. చంద్రబాబు వైఖరితో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ పెరిగిపోతున్నట్లుగా వుంది. నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావహులు పెరిగిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఆ 19 మందికి టికెట్లు ఖాయం కాగా.. మిగిలిన 156 నియోజకవర్గాల్లో జనసేన 50 సీట్లు కోరుతోంది. అంటే మిగిలేది 106 స్థానాలు.
వీటిలోనే సీనియర్లు, జూనియర్లు, యువతకు సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో ఆయన ఎంత ఖచ్చితంగా వుంటారనే దానిపై తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి వుంది. ఏమాత్రం తేడా వచ్చినా పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోతుంది. అందుకే ఈసారి రిస్క్ తీసుకోవడానికి కూడా చంద్రబాబు వెనుకాడటం లేదు. దీనిని బట్టి సర్వేల ఆధారంగా మార్పులు చేర్పులు, స్థాన చలనాలు, టికెట్ నిరాకరణలు తప్పవని అర్ధమవుతుంది.
