గుంటూరు: రైతుల భాగస్వామ్యంతో రాజదాని నిర్మాణానికి శ్రీకారం చుట్టామని...ఈ విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది సక్సెస్ చేసి అన్ని ప్రాజెక్టుల్లో రైతుల్ని భాగస్వామ్యం చేయాలని భావిచామన్పారు. కానీ తమ ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా వైసిసి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. 

టిడిపి మహానాడు కార్యక్రమంలో భాగంగా రాజధాని అమరావతిపై చంద్రబాబు నాయుడు ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... ''28,500 మంది రైతులు 33వేల రైతులు ఉదారంగా భూములిచ్చారు.  కానీ  వైసిపి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని తప్పుడు ప్రచారం చేశారు. ఒకటికి పదిసార్లు అబద్దాలను ప్రచారం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నారు'' అని అన్నారు. 

''కులం, మతం అంటూ ప్రజల్ని నమ్మించారు. అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేతకాక విచ్ఛిన్నం చేస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సిన ఆదాయం ఇచ్చే అమరావతి రాష్ట్రానికి భారం అన్నారు. నాడు సైబరాబాద్ నిర్మాణ సమయంలోనూ ఇదే విధమైన ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు సైబరాబాద్ వలన కలిగిన ఉపాధి, ఉద్యోగాలు, ఆదాయం చూడండి. కేవలం ఐటీ వలన ఆ రాష్ట్రానికి రూ.17వేల కోట్ల ఆదాయం వస్తోంది.  నాడు నిర్మించిన నాలెడ్జ్ సెంటర్ నేడు తెలంగాణ రాష్ట్రానికి గుండెలా మారింది'' అని తెలిపారు. 

Read more   కమీషన్లకు వైన్..దందాలకు మైన్, జగన్‌ది కరెప్షన్ బ్లడ్ గ్రూప్: మహానాడులో లోకేశ్

''అమరావతికి భూములిచ్చిన రైతులు 162 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నవారికి అండగా మేం ఉంటాం. మరణించిన వారికి మహానాడు వేధిక ద్వారా సంతాపం తెలియజేస్తున్నాం. అమరావతి పూర్తైతే ఆదాయం వచ్చేది, స్థానికంగానే ఉపాధి, ఉద్యోగాలు వచ్చేవి. రాబోయే వందేళ్లకు వీలుగా అమరావతిని డిజైన్ చేశాం'' అని వెల్లడించారు. 

''జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలు తప్ప.. నిజం చెప్పడు. అమరావతిలో అవినీతి అన్నారు ఏడాదిగా ఏం చేశారు.? పనులు కాలేదన్నారు.  పరిశీలించమంటే తోక ముడిచారు. 
అమరావతి మునిగిపోతుందన్నారు, పునాది నిర్మాణ వ్యయం ఎక్కువ అన్నారు. పనకిమాలిన కమిటీలతో తప్పుడు రిపోర్టులు ఇప్పించారు. రాజధాని నిర్ణయించాక మార్చే హక్కు మీకెవరిచ్చారు? ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతారా?  రాజధాని నిర్ణయంపై సెలెక్ట్ కమిటీ కావాలంటే.. దుర్మార్గంగా ముందుకెళ్తున్నారు'' అని మండిపడ్డారు. 

''రైతులు ఇచ్చిన భూముల్ని ఇళ్ల స్థలాల పేరుతో పంచుతామంటున్నారు. ఎదురు దాడి చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏడాదిలో చేసిందేమీ లేదు. పవిత్ర జలాలు, పవిత్ర మట్టితో పునీతం చేసిన అమరావతికి తప్పకుండా పూర్వ వైభవం వస్తుంది. అమరాతిని రాజధానిగా కొనసాగిస్తామంటే మేం తప్పకుండా మద్దతిస్తాం. అలా కాదంటే టీడీపీ పోరాటం చేస్తుందని మహానాడు సాక్షిగా హెచ్చరిస్తున్నాం'' అని చంద్రబాబు అన్నారు.