నేను ఏ తప్పు చేయలేదు.. రాజకీయ కక్షతోనే అభియోగాలు: ఏసీబీ కోర్టులో స్వయంగా చంద్రబాబు వాదనలు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా తన వాదనను వినిపించారు.

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఓపెన్ కోర్టులో వాదనలు వినేందుకు ఏసీబీ న్యాయమూర్తి అంగీకరించారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించేందుకు ముగ్గురు న్యాయవాదులు అనుమతి కోరగా.. ఇద్దరికి మాత్రమే న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు తరఫున సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుపై 409 సెక్షన్ పెట్టడం సబబు కాదని సిదార్థ లూథ్రా వాదనలు వినిపించారు. 409 పెట్టాలంటే ముందుగా సరైన సాక్ష్యాధారాలు చూపించాలని అన్నారు. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని సిద్దార్థ లూథ్రా నోటీసు ఇచ్చారు. తిరస్కరణలపై వాదనలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తిని కోరారు. అందుకు ఏసీబీ న్యాయమూర్తి అనుమతించారు. చంద్రబాబు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.
ఈ క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జూలుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా చట్టబద్దమైన పాలన జరగడం లేదని అన్నారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్ట్ చేశారని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని చంద్రబాబు తెలిపారు. తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమని అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే తనపై తప్పుడు ఆరోపణలు అని అన్నారు. శనివారం ఉదయం 5.40 గంటలకు సీఐడీ తనకు నోటీసులు ఇచ్చిందని.. అయితే ఈరోజు ఉదయం 5.40కు రిమాండ్ రిపోర్టు ఇచ్చారని చెప్పారు.
ఇక, అరెస్ట్ చేసిన 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలనే నిబంధనను పాటించలేదని చెప్పారు. సీఐడీ అధికారుల తీరును న్యాయమూర్తికి వివరించారు. చంద్రబాబు దగ్గరకు వచ్చిన పోలీసులు మొబైల్ లోకేషన్ పరిశీలించాలని కోరారు.
ఆ తర్వాత సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు ప్రారంభించింది. ఇక, ఇరుపక్షాల వాదనల అనంతరం చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.