చంద్రబాబునాయుడికి స్కిన్ అలర్జీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
స్కిల్ డెవల్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు స్కిన్ అలర్జీ వచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు.

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టై గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అస్వస్థత కారణంగా ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలిపారు. వాతావరణం లో కొద్దిరోజులుగా జరుగుతున్న మార్పులు.. తీవ్ర ఎండా, ఉక్కపోతల కారణంగా ఆయన అలర్జీతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిసింది.
చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అధికారులు స్పందించారు. రాజమండ్రిలోని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మికి సమాచారం అందించారు. చంద్రబాబు నాయుడుకి చికిత్స నిమిత్తం వైద్యులను పంపాలని లేఖలో పేర్కొన్నారు. దీనిమీద జిజిహెచ్ సూపర్డెంట్ వెంటనే స్పందించారు. చంద్రబాబుకు పరీక్షల నిమిత్తం ఇద్దరు స్కిన్ స్పెషలిస్టులను కేటాయించారు.
అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సూర్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ సునీతాదేవి చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం సెంట్రల్ జైలుకు వెళ్లారు. చంద్రబాబును పరీక్షించిన తర్వాత.. వైద్యులు జిజిహెచ్ కు వెళ్లిపోయారు. ఎలాంటి వివరాలు అందించలేదు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షల్లో వెల్లడైన వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలుస్తోంది.
దీని మీద సెంట్రల్ జైలు డిప్యూటీ సూపర్డెంట్ రాజకుమార్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉందని చెప్పడంతో వెంటనే వైద్యుల్ని పిలిపించి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వారు అవసరమైన మందులు సూచించినట్లు చెప్పుకొచ్చారు. డాక్టర్లు చెప్పినట్లుగానే వారు సూచించిన మందులను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఇచ్చినట్లు తెలిపారు. ఆ తరువాత జైలు అధికారులు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
చర్మవ్యాధి బారిన పడిన క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు బిపి 140/80 ఎంఎంహెచ్ జీ, టెంపరేచర్ నార్మల్ గా ఉందని ఆ హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. పల్స్ రేటు నిమిషానికి 87 ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.