స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. గత రాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. గత రాత్రి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు జైలులో ప్రత్యేక వసతి కల్పించారు. ఒక సహాయకుడిని కూడా అనుమతించారు. ఐదుగురు సిబ్బందితో భద్రత కల్పించారు. అయితే చంద్రబాబును అర్దరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి జైలుకు తీసుకురాగా.. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించినట్టుగా తెలుస్తోంది. అయితే ఉదయం నిద్రలేచిన తర్వాత చంద్రబాబు కాసేపు యోగా చేసినట్టుగా సమాచారం. 

ఇదిలాఉంటే, చంద్రబాబుకు బ్రేక్‌ఫాస్ట్ ఫ్రూట్ సలాడ్ అందించారు. చంద్రబాబుకు కోర్టు ఇంటి భోజనానికి అనుమతించిన దృష్ట్యా ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాపీని కుటుంబ సభ్యులు పంపించారు. ఇక, చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్‌కు ఎదురుగానే ఉన్న జైలు ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇక, ఈరోజు చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణిలకు జైలు అధికారులు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక, చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. 

ఇదిలాఉంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ ఈరోజు ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు జనసేన, సీపీఐతో పాటు పలు పక్షాలు మద్దతు తెలిపాయి. టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని కొన్ని స్కూల్స్ నేడు సెలవు ప్రకటించాయి. కొన్నిచోట్ల స్వచ్చందంగా దుకాణాలను మూసివేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీచేశారు.