అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వరాలు ప్రకటిస్తోంది. ముఖ్యంగా రైతన్నపై వరాల జల్లు కురిపిస్తోంది. 

ఇప్పటికే పింఛన్లు పెంపు, ఆటో,ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ ఎత్తివేత, అన్ని కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6వేలుతోపాటు మరో రూ.4వేలు కలిపి రైతుకు రూ.10వేలు పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయించింది. 

అయితే ఆ పెట్టుబడిని మరింత పెంచేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడి సాయాన్ని రూ.10వేలు నుంచి రూ.15 వేలుకు పెంచారు. అమరావతిలో పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశమైన చంద్రబాబు అన్నదాత సుఖీభవం పథకంపై చర్చించారు. 

ఆ సమావేశంలో పెట్టుబడి సాయాన్ని రూ.15వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే రూ.6వేలకు రాష్ట్రప్రభుత్వం రూ.9వేలు కలిసి మెుత్తం రూ.15వేలు చెల్లించాలని చంద్రబాబు నాయుడు తీర్మానించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రథమంగా చేర్చనున్నట్లు సమాచారం.