శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీటూ తరహాలో ఉద్యమం చేపడతామని కేంద్రప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకు తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శ్రీకాకుళం జిల్లాలో ఇంత విపత్త జరిగితే కనీసం కేంద్రం నుంచి ఒక్కరు కూడా రాలేదని మండిపడ్డారు. తుపాన్ బాధితులను ఆదుకునే బాధ్యత కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు.  రాజకీయాలే ముఖ్యమా? అని కేంద్రాన్ని నిలదీశారు. మోదీ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తోందని విమర్శించారు. తుఫాన్ సహాయక చర్యల్లో తాము ఉంటే, తమ పార్టీ ఎంపీల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తారా? అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 

బీజేపీ కార్యాలయ శంకుస్థాపనకు ఇది సమయమా అంటూ చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. గుంటూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీకాకుళం రాకుండానే వెళ్లిపోయారని విమర్శించారు. మరోవైపు పక్కజిల్లాలో ఉన్నా వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిత్లీ తుఫాన్ బాధితులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. చెట్లతొలగింపు కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈనెల 29లోగా తిత్లీ తుఫాన్ బాధితులకు పూర్తి స్థాయి న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

మరోవైపు తుఫాన్ హెచ్చరికల సమయంలో కొంతమంది దిగువ స్థాయి అధికారులు అలసత్వం వహించారని అది తన దృష్టికి వచ్చిందన్నారు. కావాలనే అలసత్వం వహించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే తిత్లీ తుఫాన్ బాధితుల సహాయార్థం ఏపీ ప్రభుత్వం విరాళాలు ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉద్దానం రిహబిటేషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.