తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి మనసు చాటుకున్నారు. ఓ వైసీపీ మహిళా కార్యకర్త కుమార్తె చదవుకు ఆర్థిక సాయం అందించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంచి మనసు చాటుకున్నారు. ఓ వైసీపీ మహిళా కార్యకర్త కుమార్తె చదవుకు ఆర్థిక సాయం అందించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను చంద్రబాబు గురువారం పరామర్శించారు. ఈ క్రమంలోనే ఉంగుటూరు నియోజకవర్గంలో వైసీపీ మహిళా కార్యకర్త ప్రభావతి చంద్రబాబు వద్ద తన బాధను చెప్పుకుంది. ధాన్యం తడిచిపోయి రోడ్డున పడ్డామని.. ప్రభుత్వం, తమ పార్టీ నాయకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. వారు వేరే రాష్ట్రంలో చదువుతున్నారని ప్రభావతి చెప్పింది. ధాన్యం అమ్మిన డబ్బుతో తన పెద్ద కూతురు పరీక్ష ఫీజు కట్టాల్సి ఉందని తెలిపింది. ధాన్యం తడిసిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఫీజు కట్టకపోతే తన కూతురు పరీక్ష రాయడం ఆగిపోతుందని అన్నారు. వైసీపీపై మనసులో ఉన్న అభిమానం ఈరోజుతో పోయిందని చెప్పారు.
ఈ క్రమంలోనే స్పందించిన చంద్రబాబు నాయుడు.. ‘‘మీ అమ్మాయి కాలేజ్ ఫీజు ఎంత?’’ అని ప్రభావతిని అడిగారు. దీనికి ఆమె రూ. 2.30 లక్షలు అని చెప్పింది. అయితే చంద్రబాబు ఆమెకు వెంటనే ఆ నగదు అందించారు. తాను కష్టంలో ఉన్న ఆడబిడ్డ జీవితం కోసం పార్టీ చూడకుండా, వ్యక్తిని చూడకుండా సాయం చేస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు అందరికీ చేయలేకపోవచ్చు గానీ.. ముఖ్యమంత్రిగా ఉంటే అందరికి చేసి ఉండేవాడినని చెప్పారు.
ఈ పరిణామంతో ప్రభావతి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. చంద్రబాబుకు థాంక్స్ చెప్పింది. చంద్రబాబు తమకు దేవుడు లెక్క అని పేర్కొంది. దేవుడుకు ఎలా విధేయతతో ఉంటామో.. తమ కుటుంబం చంద్రబాబుకు విధేయతతో ఉంటామని చెప్పింది. తాము తెలుగుదేశం పార్టీ కోసం ఏ చిన్న పనిచేయలేదని ప్రభావతి చెప్పింది. తాను వైఎస్సార్ పార్టీ కోసం ఎంతో కృషి చేశామని.. కొంత సొంత డబ్బులు కూడా ఖర్చు చేశామని తెలిపింది. తనకు రేషన్ ఇస్తానని హామీ ఇచ్చారని.. కానీ దానిని నిలబెట్టుకోలేదని చెప్పింది. తాను ఈరోజు హృదయపూర్వకంగా టీడీపీ జెండా వేసుకుంటానని తెలిపింది. ఇక నుంచి తనది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. టీడీపీ నుండి పిలుపొస్తే తినే అన్నం వదిలేసి మరీ వస్తానని పేర్కొంది.
