కొనసీమ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. 

కొనసీమ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎక్కడో కాశ్మీర్ లో వినిపించే ‘‘ఇంటర్నెట్ సేవలు నిలిపివేత’’ అనే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధకరమని పేర్కొన్నారు. ఐటీ వంటి ఉద్యోగాలు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం.. కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణమని మండిపడ్డారు. 

ఇంటర్ నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు. చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని.. ప్రభుత్వ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు ట్వీట్ చేశారు. 

కొద్ది రోజుల క్రితం కోనసీమ అల్లర్ల ఘటనపై స్పందించిన చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కోనసీమని వైసీపీ మనుషులే తగులపెట్టారని.. అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదేనంటూ దుయ్యబట్టారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారని.. మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు గుర్తుచేశారు. వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగనుకు అలవాటుగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని జగన్ నడపలేరని.. మధ్యంతరానికి సిద్దపడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

62 మంది అరెస్ట్..
ఇక, కొత్తగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు బీఆర్‌ అంబేద్కర్‌ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ మే 24న అమలాపురంలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అమలాపురంలో అల్లర్ల ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఇప్పటివరకు 62 మందిని అరెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి అక్కడ ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. సీసీటీవ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్న పోలీసులు.. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. 

ఈ ఘటనలో తొలుత 19 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఎక్కువ మంది కాపు, సెట్టిబలిజ, ఇతర ఓసీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అరెస్టులు చేసే సమయంలో నిందితులపై కక్ష సాధింపును పరిగణనలోకి తీసుకోవడం లేదని పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడిన వారందరినీ అరెస్టు చేస్తామని, ఎవరినీ విడిచిపెట్టబోమని పోలీసులు తెలిపారు. ఇక, కొనసీమలో మరో నాలుగు రోజుల పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉండే అవకాశం ఉంది. ఇంటర్ నెట్ సేవలు పునరుద్దరించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.