Asianet News TeluguAsianet News Telugu

కాలర్ ఎగరేద్దామనుకున్నారు.. కానీ, ప్రజలు కాలర్ పట్టుకుని నిలదీస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు విమర్శ

వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాలర్ ఎగరేసుకుని తిరగాలని అనుకున్నారని, కానీ, ప్రజలు వారిని ప్రశ్నిస్తున్నారని, నిలదీస్తున్నారని చెప్పారు. 
 

chandrababu naidu demands govt to release unconditionlly engineering grauduate
Author
Amaravati, First Published Aug 5, 2022, 1:11 PM IST

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు కురిపించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి వ్యతిరేకత చూసి తీవ్ర అసహనానికి లోనవుతున్నదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కోతలు, అభివృద్ధి పనుల్లో లోపాలతో ప్రజల్లో అసంతృప్తి నెలకొందని ఆయన అన్నారు. ఆ వ్యతిరేకతను వైసీపీ తట్టుకోలేక తప్పుడు పనులు చేస్తున్నదని చెప్పారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొంటూ పూతలపట్టు ఇంజినీరింగ్ స్టూడెంట్ అరెస్టు ఘటనను ప్రస్తావించారు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు పరిధిలోని వేపనపల్లిలో ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అన్నారు. విద్యా దీవెన రాలేదని వైసీపీ ఎమ్మెల్యేను ప్రశ్నించడం కలకలం రేపింది. దీంతో ఆ విద్యార్థిపై కేసు పెట్టి అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. ఇది ప్రభుత్వ అసహనానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. 

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. విద్యార్థులనూ వదలరా? అని చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థులపైనా అక్రమ కేసులు పెట్టి వారి భవిష్యత్తును నాశనం చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ పాలన పై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, గడగడపకూ వారికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నదని తెలిపారు. 

వైసీపీ ఎమ్మెల్యేలు కాలర్ ఎగరేసుకుని తిరుగుదామని అనుకున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కానీ, ప్రజలే వారిని కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తున్నారని అన్నారు. వేపనపల్లి  ఘటనపై వైసీపీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జశ్వంత్‌తోపాటు అతడికి అండగా నిలిచిన స్థానిక గ్రామస్తులు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios