విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రసంగంపై ఏపీలోని అధికార వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. అయితే ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు.
విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రసంగంపై ఏపీలోని అధికార వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు.. రజనీకాంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వైసీపీ మద్దతుదారులు.. రజనీకాంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. రజనీకాంత్‌పై వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై రజనీకాంత్ చిన్న విమర్శ కూడా చేయలేదని అన్నారు. కేవలం తన అభిప్రాయలను మాత్రమే పంచుకున్నారని.. అయినప్పటికీ రజనీకాంత్‌పై అర్థం లేని విమర్శలు చేయడం తెలుగు ప్రజలు ఎవరూ సహించరని అన్నారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలని కోరారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి వారి తప్పు సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.
‘‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీకాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు... ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి....జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇక, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరై సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. సినిమా రంగంలోనూ, రాజకీయంలోనూ రాణించారని గుర్తుచేసుకున్నారు. అదే విధంగా వేదికపై ఉన్న చంద్రబాబు నాయుడుపైన కూడా రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. అయితే చంద్రబాబును ప్రశంసించిన రజనీకాంత్ టార్గెట్‌గా వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు టీడీపీ నాయకులు, రజనీకాంత్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు.
