ఏసీబీ కోర్టుకు సిద్దార్థ లూథ్రా.. కాసేపట్లో చంద్రబాబుకు బెయిల్ కోసం పిటిషన్.. 5రోజుల కస్టడీ కోరుతున్న సీఐడీ
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. గత రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. గత రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుకు బెయిల్ కోసం తొలతు విజయవాడ ఏసీబీ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం సుప్రీం కోర్టు న్యాయవాది సిదార్థ లూథ్రా కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయనున్నారు. ఏసీబీ కోర్టు తీర్పులోని అంశాల ఆధారంగా ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
అయితే ఏసీబీ కోర్టుకు చేరుకున్న సమయంలో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన లాయర్ సిద్దార్థ లూథ్రా.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టుగా చెప్పారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని అన్నారు. ఆయనను జైలులో ఉంచడం ప్రమాదకరమని పేర్కొన్నారు. హౌస్ అరెస్ట్‌పై తమ వాదనలను వినిపిస్తామని చెప్పారు. గతంలో పశ్చిమ బెంగాల్ మంత్రుల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తామని తెలిపారు.
ఇక, సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ స్కామ్‌పై చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని అన్నారు. చంద్రబాబును ఐదు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని చెప్పారు. చంద్రబాబు తరఫున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదని అన్నారు. భద్రతాపరంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే వేరే చోటు ఉండదని అన్నారు.