చంద్రబాబు హౌస్ అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని కోరుతున్న ఆయన న్యాయవాదులు.. లంచ్ తర్వాత కీలక విచారణ..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హౌస్ అరెస్ట్‌కు ఇవ్వాలన్న పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హౌస్ అరెస్ట్‌కు ఇవ్వాలన్న పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబును హౌస్ అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా కోర్టును కోరారు. అయితే హౌస్ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. అయితే అదనపు అడ్వొకేట్ జనరల్ అందుబాటులో లేరని, కొంత సమయం ఇవ్వాలని సీఐడీ సిట్ స్పెషల్ జీపీ ఏసీబీ న్యాయమూర్తిని కోరారు. ఈ క్రమంలోనే హౌస్ కస్టడీకి సంబంధించిన కౌంటర్ లంచ్ టైమ్ లోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక, లంచ్ తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. విచారణ అనంతరం న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు.
ఇక, సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ స్కామ్‌పై చంద్రబాబు నుంచి సీఐడీ ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని అన్నారు. చంద్రబాబును ఐదు రోజుల సీఐడీ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశామని చెప్పారు. చంద్రబాబు తరఫున ఇంకా బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదని అన్నారు. భద్రతాపరంగా రాజమండ్రి సెంట్రల్ జైలు కంటే మంచిచోటు వేరే ఉండదని అన్నారు.