Chandrababu Naidu Comments: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో కొందరు నేతలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

తెలుగుదేశం పార్టీలో సీనియారిటీని గౌరవిస్తాం.. సిన్సియారిటీని గుర్తిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సీనియారిటీ ఉన్నా ఓట్లు వేయించలేని పరిస్థితి ఉంటే ఏం లాభం అని ప్రశ్నించారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్షేత్ర స్థాయిలో పని చేయకుండా మాయ చేసే నేతలకు ఇకపై చెక్ పెట్టనున్నట్లు తెలిపారు. కొంత మంది నేతలు ఫీల్డులో పని చేయకుండా.. పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉంటారన్నారు. ఏదో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు కదా అని తాము కొన్నిసార్లు నమ్ముతామని తెలిపారు. ఇకపై పనిచేసే వారేవరో పర్యవేక్షించే వ్యవస్థ వచ్చిందన్నారు. 

ఓట్లు వేయించలేని సీనియర్లు కూడా తమకే ప్రాధాన్యమివ్వాలని కోరితే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఓట్లు వేయించలేని సీనియర్లకే ప్రాధాన్యమిస్తే ప్రతిపక్షంలోనే ఉంటాం. ఎన్నికల్లో 40 శాతం యువతకు సీట్లిద్దామన్న పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తటస్తులనూ పార్టీలో ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పార్టీలో పనిచేసే యువనేతలనూ గుర్తిస్తామని.. వారికి అవకాశాలిస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికలు ఓ పద్దతిగా చేపట్టడం టీడీపీ ఆనవాయితీ అని అన్నారు.

సమాజ హితం కోసం టీడీపీ అవసరముందని చంద్రబాబు అన్నారు. అందుకే విరాళాలు సేకరిస్తున్నట్టుగా చెప్పారు. పార్టీకి విరాళాలు వస్తే కొంతమందికైనా సాయం చేయవచ్చని తెలిపారు. పార్టీలో ఏ పదవులు రావాలన్నా సభ్యత్వంతోనే ముడిపడి ఉందన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని చంద్రబాబు స్పష్టం చేశారు. నిజమైన కార్యకర్తలకు సరైన గౌరవం లభించడం లేదనే బాధ కొందరిలో ఉందని.. ఆ బాధను తప్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైసీపీ అరాచక పాలనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు అందరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.