విద్యుత్ కొనుగోళ్లపై ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. పీపీఏలపై నిజానిజాలు వక్రీకరించారంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ రంగంలో రెగ్యులేటరీ కమీషన్ తీసుకొచ్చింది టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంక్షోభాన్ని నివారించడంతో పాటు భవిష్యత్తులో కరెంట్ ఛార్జీలు పెంచుకుండా చర్యలు తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ఇదే సందర్భంలో జగన్‌కు చెందిన సండూర్ పవర్ కంపెనీకి కర్ణాటక ప్రభుత్వం రాసిన లేఖను చంద్రబాబు సభలో ప్రస్తావించారు.

జగన్ కర్ణాటకలో విద్యుత్ వ్యాపారం చేస్తున్నారని.. డెవలపర్‌గా ఆయనకు ఎక్కువ డబ్బులు కావాలన్నారు. నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుందని.. పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేటుకే మీరు కరెంట్ కొంటున్నారని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు.

వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ హయాంలో జరిగిన పీపీఏల ఒప్పందంపై ఐదేళ్ల పాటు సమీక్షలు జరిపి చివరకు ఆయనే క్లీన్ చీట్ ఇచ్చారని బాబు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 137 అవార్డులు వచ్చాయని.. విద్యుత్ శాఖను కుప్పకూల్చొద్దని చంద్రబాబు హితవు పలికారు.