ఢిల్లీ: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎందుకు విమర్శిస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో తాను ఏం తప్పు చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. అద్భుతమైన హైదరబాద్ మహానగరాన్ని నిర్మించి ఇచ్చా అది తాను చేసిన తప్పా అంటూ నిలదీశారు. 

హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఎవరూ నిర్మించలేరని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అది తన వల్లే తప్ప ఎవరి వల్ల సాధ్యం కాదన్నారు. ఆఖరికి కేసీఆర్ కూడా అలాంటి నిర్మాణం చెయ్యలేరన్నారు. తెలంగాణలో అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది తానేనని చెప్పడానికి గర్వపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో కంపెనీల కోసం ఎన్నో దేశాలు తిరిగానని స్పష్టం చేశారు. 

కేసీఆర్ తో కలుద్దామని తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని అయితే అందుకు కేసీఆర్ అంగీకరించలేదన్నారు. పొత్తులపై మాట్లాడదామంటే కుదరలేదన్నారు. అయితే పొత్తులపై టీఆర్ఎస్ పార్టీయే చెప్తోంది టీడీపీతో పొత్తు అవసరం లేదని అని చెప్పుకొచ్చారు. కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రాలు కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఇద్దరం కలిసి  జాతీయ స్థాయిలో కీ రోల్ చేస్తే కానీ సాధ్యం కాదని చెప్పానని అందుకు కేసీఆర్ అంగీకరించలేదన్నారు. 

కేసీఆర్ థర్డ ఫ్రంట్ ప్రయత్నాలు ఆగిపోలేదని ఇంకా కొనసాగుతున్నాయన్నారు. కేసీఆర్ ఎటువైపో అన్నది ఆయననే అడగాలని సూచించారు. దేశం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో ఆయననే అడగండని సూచించారు. దేశంలో రెండే రెండు కూటములు ఉన్నాయని ఒకటి బీజేపీ కూటమి, రెండు బీజేపీయేతర కూటమి అని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  

త్వరలోనే అమరావతి రాజధానిని నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. దేశంలోని అత్యుత్తమ ఐదు రాజధానిలలో ఒకటిగా అమరావతిని నిర్మించి తీరుతామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. దేశానికే ఒక నమూనాగా అమరావతిని నిర్మిస్తానన్నారు.