ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకృతి వనరులను మనం కాపాడితేనే అవి మనల్ని కాపాడతాయని అన్నారు. ప్రకృతి నాశనమయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకృతి వనరులను మనం కాపాడితేనే అవి మనల్ని కాపాడతాయని అన్నారు. ప్రకృతి నాశనమయ్యేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పర్యావరణ విధ్వంసానికి జగన్‌కు అధికారం లేదన్నారు. ‘‘కొండలను మింగేస్తున్న వైసీపీ భూబకాసురలు’’ పేరుతో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పంలో కూడా వైసీపీ అక్రమ మైనింగ్‌ జరుపుతోందని ఆరోపించారు. మైనింగ్ మంత్రే అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని విమర్శించారు. కుప్పంలో జరిగే మైనింగ్ ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. కొండల్ని అక్రమంగా తవ్వుతున్న వారిని బోనెక్కిస్తాం అని అన్నారు.

ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని అన్నారు. బమిడికలొద్దిలో లాటరైట్, బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపించారు. తుపాన్‌లు రాకుండా మడ అడువులు సహాయపడతాయని చెప్పారు. అలాంటిది కాడినాడలో మడ ఆడవులను నరికేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్టుగా వ్యవహరిస్తోందన్నారు. 

వ్యక్తులు శాశ్వతం కాదని.. సమాజం శాశ్వతం అని చంద్రబాబు అన్నారు. ఎంతో చరిత్ర ఉన్న కొండలను మింగేస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి గ్యాంగ్ చెరువులను, కొండలను తవ్వేస్తున్నారని మండిపడ్డారు. విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండను కూడా తవ్వేశారని ఆరోపించారు. సమాజానికి చెడు చేసే వ్యక్తులతోనే తన పోరాటం అని చెప్పారు. భవిష్యత్ తరాల కోసమే తన యుద్దం అని తెలిపారు. ప్రకృతి విలయ తాండవం చేస్తే తట్టుకోలేమని అన్నారు. అక్రమ తవ్వకాలపై సీఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.