జగన్ హయాంలో 1.75లక్షల ఎకరాలు కబ్జా.. ఏపీలో రీ సర్వే నిలిపేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 1.75 లక్షల ఎకరాల భూములను అక్రమంగా దోచుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు గడిచిన ఐదేళ్లలో జరిగిన వివిధ అక్రమాలను ప్రస్తావించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల సహజ వనరులను గత వైసీపీ ప్రభుత్వం దోచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ఉగ్రవాద చర్యలతో ఇష్టానుసారంగా భూములు, గనులు, ఎర్రచందనం, అటవీ సంపదనంతా దోచేశారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీకి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో సహజ వనరుల దోపిడీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘గత ప్రభుత్వం పంచభూతాలను మింగేసింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణ జరిగింది. ఖనిజ సంపద, అడవులను ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు. మాకు అందిన రికార్డుల ప్రకారం కంటే ఎక్కువగానే దోపిడీ జరిగింది. ఆర్థిక ఉగ్రవాదులందారూ వినూత్నంగా దోపిడీ పంథాను ఎన్నుకున్నారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరు, తిరుపతిలో జరిగిన సహజ వనరుల దోపిడీ ఒక కేస్ స్టడీ. ఇళ్ల స్థలాల పేరుతో ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ముందుగానే భూములు గుర్తించి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటికి రెండింతలు ధర నిర్ణయించుకుని ప్రభుత్వానికి విక్రయించారు. 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించుకుని ప్యాలెస్లు కట్టుకున్నారు. ఐదేళ్లపాటు ప్రజాస్వామ్యానికి గంతలు కట్టారు. అసైన్డ్ భూములను ఇష్టారీతిన అనర్హులకు కేటాయించుకున్నారు. భూ సర్వే పేరుతో భూముల సరిహద్దులను మార్చారు. వైసీపీ భూ దోపిడీకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పరాకాష్ట... భూమ్మీద హక్కులు లేకుండా చేయడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు’’ అని ఆరోపించారు.
విశాఖలో కబ్జాలు, దందాలు..
‘‘విశాఖలో రామానాయుడు స్టూడియోకు ఇచ్చిన భూమిని అక్రమంగా రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి వాటా కొట్టేయాలని చూశారు. ప్రస్తుతం ఆ వివాదం సుప్రీం కోర్టులో ఉంది. విశాఖలో రామానాయుడు స్టూడియోకు నేనే గతంలో భూమలు ఇచ్చా. హైదరాబాద్ తర్వాత విశాఖ షూటింగ్లకు అనుకూలంగా ఉంటుందని కేటాయించాం. 12.51 ఎకరాల హయగ్రీవ భూముల్ని ఓల్డేజ్ హోంకు ఇస్తే దాన్ని విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొట్టేయాలని చూశారు. శారదా పీఠానికి రూ.లక్ష చొప్పున 15 ఎకరాలు అందించారు. షాఫీ హియరింగ్ క్యారీకి ఒక్కో ఎకరా రూ.15 కోట్లు విలువ చేసే భూమిని ఉచితంగా ఇచ్చారు. ప్రభుత్వ భూములను సొంత సొమ్ములా దానంగా ఇచ్చారు. దసపల్లా భూముల్లో కూడా అక్రమంగా అపార్ట్ మెంట్లు నిర్మించారు. మాజీ ఎంపీ ఎంవీవీ ఎన్కే హౌసింగ్ కంపెనీకి 10.57 ఎకరాలు కేటాయించి 0.96 శాతం వాటా లబ్ధిదారులకు ఇచ్చారు. ఎంవీవీ బిల్డింగ్స్ అనుమతి ఇచ్చి రూ.65 కోట్ల విలువ చేసే టీడీఆర్ బాండ్లను జారీ చేసి కుంభకోణానికి పాల్పడ్డారు.’’
ఒంగోలు, తిరుపతిలో మరీ దారుణం...
‘‘ఒంగోలులో రూ.101 కోట్లు విలువ చేసే ఆస్తులను కొట్టేశారు. ప్రభుత్వ, ఖాళీ భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి కాజేశారు. ఈ దందాలో 77 మంది నిందితులు తేలారు. భూముల్లో వైసీపీ జండా పెట్టేసి కాజేశారు. తిరుపతిలో మరో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఆఖరికి మఠం భూములను కూడా దోచేశారు. తిరుచానారులో 4.5 ఎకరాలు, మంగళంలో 27.14 ఎకరాలు, దామినీడులో 3.32 ఎకరాలు, చిగురువాడలో 1.33 ఎకరాలు, సూరప్పకసంలో 12.69 ఎకరాలు, కోటమంగళంలో 15.28 ఎకరాలు, దుర్గసముద్రంలో 7.98 ఎకరాల చొప్పున ఇలా... కాలువ, ప్రభుత్వ భూములు కొట్టేశారు. కాలువ పోరంబోకు, కుంట పోరంబోకు, ల్యాండ్ సీలింగ్ భూములను కూడా వదలకుండా దోచేశారు. చిత్తూరు జిల్లాలో 982 ఎకరాలు కొట్టేశారు. 22 ఏ జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.’’
ఇళ్ల పట్టాల పేరుతో 10వేల ఎకరాలకు ఎసరు...
‘‘ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు. పేదలకు పెత్తందారులు అంటూ చెప్పిన పెద్ద మనుషుల పేదల భూములు కొట్టి వారి పొట్ట గొట్టారు. అసైన్డ్ భూమి ఒకసారి కేటాయించాక వారి నుండి తిరిగి తీసుకోవాలంటే పరిహారం ఇవ్వాల్సి ఉంది. కానీ బలవంతంగా లాక్కున్నారు. ఆవ భూముల్లో కూడా దోపిడీ జరిగింది. అవి ఇంటి స్థలాలకు పనికిరావని తెలిసినా కేటాయించారు. లెవలింగ్ పేరుతోనూ దోచుకున్నారు. ఇళ్ల స్థలాలకు గుడివాడలో 256 ఎకరాలను రూ.185 కోట్లకు కొనుగోలు చేశారు. కేసరపల్లిలో 73 ఎకరాలను రూ.51 కోట్లకు కొనుగోలు చేశారు. ఉన్న మార్కెట్ రేటు కంటే 5 రెట్లు ఎక్కువ ఇచ్చారు. వర్షాల సమయంలో సీ కోస్ట్ లో మ్యాంగ్రోవ్ ఉపయోగపడుతుంది. వాటిని కూడా ధ్వంసం చేయాలని చూశారు. వైసీపీ కార్యాలయాలకు భూములు కేటాయించడం కోసం జీవో నెంబర్ 340 తీసుకొచ్చారు. దీని ద్వారా 2 ఎకరాల చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. రాష్ట్రం మొత్తంగా రూ.300 కోట్ల విలువ చేసే 40.78 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ కార్యాలయాలకు అప్పనంగా కేటాయించుకున్నారు. కనీసం అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. తాడేపల్లిలో ఇరిగేషన్ భూమిలో అనుమతి లేకుండా నిర్మించారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నారంటే బెదిరిస్తారు... రౌడీయిజం చేస్తారు.’’
అనర్హులకు 8,086 ఎకరాలు...
‘‘రాష్ట్రంలో పేదలకు చెందాల్సిన 8,086 ఎకరాల భూమిని అనర్హులకు అప్పనంగా రాయించేసుకున్నారు. కడప జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103.15 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 318 మందికి 483 ఎకరాలు.. ఇలా మొత్తంగా 8,086 ఎకరాలను కేటాయించుకున్నారు. దీని విలువ రూ.13 వందల కోట్లు. అసైన్డ్ ల్యాండ్ అంటేనే పేదలకు రక్షణగా ఉంటుంది. ఒకరు రాసుకున్నా... రాయించుకున్నా చెల్లదు. కానీ పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. అధికారులను బెదిరించి ఫ్రీ హోల్డ్ చేశారు. ఇలాంటి భూములను పట్టాలు చేసుకున్న వారు జైలుకు వెళతారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇడుపులపాయలో జరిగిన 600 ఎకరాల భూ దోపిడీపై నాడు సర్వేలు తీయించాం. ‘దాన్ని అసెంబ్లీలో పెట్టాక నాకు తెలియదు. మా నాన్న సమయంలో తెలియక జరిగింది. ప్రభుత్వానికి అప్పగిస్తున్నాం’ అని నాడు అసెంబ్లీలో చెప్పారు.’’
పాసుపుస్తకాలు, హద్దురాళ్లపై బొమ్మలకు రూ.653 కోట్లు...
‘‘శాశ్వత భూ రక్ష చట్టం అని పెట్టి దానిపైన ప్రభుత్వ రాజముద్ర లేకుండా జగన్ ఫోటో వేసుకున్నారు. ఇదంతా మనిషి అహంభావం.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకున్నారు. రూ.13 కోట్లు ఖర్చు పెట్టి పట్టాదారు పుస్తకాలపై ఫోటోలు వేసుకున్నారు. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. వైఎస్ఆర్ భూరక్ష పేరుతో సర్వే చేసి రాళ్లపైన బొమ్మలు వేసుకున్నాడు. ఎవడన్నా చనిపోయిన తర్వాత బొమ్ములు వేసుకుంటారు. బతికుండానే బొమ్మలు వేసుకున్నాడని చాలా మంది అన్నారు. ఆ గ్రానైట్ రాళ్ల కొనుగోలుకు రూ.640 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది పిచ్చా... అహంకారమా? ప్రజాధనానికి రక్షణగా ఉండాలి కానీ... తగలబెట్టకూడదు.’’
లాక్కున్న భూములు బాధితులకు అప్పగిస్తాం..
‘‘అధికారంలో దిగిపోయే నాటికి పెద్ద స్కెచ్ వేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి నీతి ఆయోగ్ ఆదేశాలతో తెచ్చామని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి చట్టం లేదు. ప్రైవేట్ వ్యక్తులను కూడా టైటిల్ రిజిస్ట్రేషణ్ ఆఫీసర్ గా నియమించుకోవచ్చని చట్టంలో పెట్టారు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేశాం. ఇప్పటి వరకు లేవనెత్తిన వాటి ప్రకారం విశాఖలో రూ.4,469 కోట్లు, ప్రకాశంలో రూ.101 కోట్లు, తిరుపతిలో రూ.270 కోట్లు, ఇళ్ల స్థలాల్లో రూ.2,850 కోట్లు, వైసీపీ కార్యాలయానికి ఇచ్చిన వాటిల్లో రూ.300 కోట్లు, అనర్హులకు అప్పగించిన వాటిలో రూ.13 వందల కోట్లు, అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రెష్ హోల్డ్ తో రూ.14,831 కోట్లు, ఫ్రీహోల్డ్ చేసి అక్రమంగా పొందినవి రూ.6,189 కోట్లు, అక్రమంగా షట్రగళ్లా పట్టా భూములుగా మార్చిన దాంట్లో రూ.1002 కోట్లు, ఇనామ్ భూములను సర్వీస్ భూములుగా మార్చి రూ.4,165 కోట్లు కోట్లు విలువ చేస్తాయి. వీటి మొత్తం విలువ రూ.35,576 కోట్లుగా ఉంటుంది. బలవంతంగా లాక్కున్నా, ల్యాండ్ టైటిలింగ్ ద్వారా తీసుకున్నా, పేర్లు మార్చి తీసుకున్నా ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే బాధితులకు తిరిగి ఇచ్చేస్తాం. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం. మళ్లీ చేయాలంటే భయపడేలా చేస్తాం. గుంటూరులో రంగనాయకమ్మ ఆస్తులను కొట్టేశారు. అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టైనా సరే గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కున్న భూములను తిరిగి బాధితులకు అప్పగిస్తాం.’’ అని చంద్రబాబు ప్రకటించారు.
వైసీపీ భూ కబ్జాలపై టోల్ ఫ్రీ నంబర్...
‘‘భూ కబ్జాలపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తాం. మా దృష్టికి తీసుకొచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి బాధితులకు అప్పగిస్తాం. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. రెవెన్యూ వచ్చే శాఖల్లో బయట నుండి తీసుకొచ్చినవారిని పెట్టుకున్నారు. పేదలకు ఉచితంగా ఇంటి జాగా ఇస్తున్నామని చెప్పి పేదల పేరుతో భూములు కొట్టేశారు. ఆకాశమే హద్దుగా వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. రేషన్ బియ్యంలో కూడా లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డారు. ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తికే పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్ల అసోసియేషన్ పదవుల్లో ఉన్నారు. భూముల రీ సర్వే జరిగిన చోట అవకతవకలు జరిగి ఉంటే సరిచేస్తాం. గతంలో హద్దులకు సంబంధించిన సమస్య ఉంటే వారి ముందే సమస్యలు పరిష్కరించాం. కానీ గత ప్రభుత్వం కేవలం హద్దు రాళ్లపై బొమ్మలు వేసుకోవడానికి మాత్రమే భూ సర్వే తెచ్చారు. ఈ భూ సర్వేను నిలిపేస్తాం. వైసీపీ ప్రభుత్వ దోపిడీపై ప్రజల్లో చర్చ జరగాలి. వైసీపీ తప్పిదాలను ప్రజల ముందు పెట్టి వారి అనుమతితోనే చర్యలు తీసుకుంటాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.