బోస్టన్ తో విజయసాయి అల్లుడికి లింక్, అదో చెత్త: చంద్రబాబు

మూడు రాజధానుల ప్రతిపాదనపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చిన నివేదికపై చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. బీసీజీ నివేదిక ఓ చెత్త కాగితమని ఆయన విమర్శించారు. 

Chandrababu makes verbal attack on BCG report

విజయవాడ: మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) అందించిన నివేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. క్లయింట్ కు ఏది కావాలో అది బీసీజీ రాసిందని, అదో చెత్త నివేదిక అని ఆయన అన్నారు. 

బోస్టన్ కంపెనీతో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. అజయ్ కల్లెం చెప్పినట్లుగా జీఎన్ రావు కమిటీ నివేదికను సమర్పించిందని ఆయన అన్నారు. బోస్టన్ కమిటీకి తలాతోక లేదని ఆయన అన్నారు. అమరావతిని రాజధానిగా వైఎస్ జగన్ అప్పుడు అంగీకరించారని ఆయన అన్నారు. 

ఎవరిని మోసం చేయడానికి హైపవర్ కమిటీ వేశారని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలో హుదుద్ తుఫాను వచ్చిన విషయాన్ని, కర్నూలు వరదలతో మునిగిపోయిన విషయాన్ని నివేదికలో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన అడిగారు. రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తే పెట్టుబడులు అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. బోస్టన్ కమిటీని అసలు ఎప్పుడు వేశారని ఆయన అడిగారు. 

అమరావతి ప్రాంతమే రాజధానికి అనుకూలమని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని ఆయన చెప్పారు. రాజధానిని మరో ప్రాంతానికి తరలించే హక్కు జగన్ కు లేదని అన్నారు. బోస్టన్ కమిటీ నివేదిక అబద్ధాల పుట్ట అని, అదో చెత్త కాగితమని ఆయన అన్నారు. అమరావతి నిర్మాణానికి లక్షా 15 వేల కోట్లు అవుతుందని ఎవరు చెప్పారని ఆయన అడిగారు. 

విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి చెప్పింది బీసీజీ రాసిచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆ నివేదికకు విశ్వసనీయత ఉందా అని అడిగారు. అజయ్ కల్లెం చెప్పిందే రాసిచ్చానని జీఎన్ రావు చెప్పారని, తప్పుడు నివేదికలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios