అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఏడాది పాలన సంబరాలు జరుపుకోవడంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ఈ వీడియోను జత చేస్తూ వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంతు విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియో ఇది అని ఆయన అన్నారు తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకమని, ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకా ఎలో బెంబేలెత్తిస్తారో.. హతవిధీ అని ఆయన వ్యాఖ్యానించారు.

 

"సంపూర్ణ మద్యనిషేధానికి 45 రోజుల లాక్ డౌన్ కాలం సరైనది. కానీ ఈ ప్రభుత్వం చదువు చెప్పే టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా పెట్టించి మరీ మద్యాన్ని అమ్మింది. ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది?" అని ఆయన మరో వీడియోను జత చేశారు. 

 

"వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి 6నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారు" అని చంద్రబాబు అన్నారు. 

"ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత" అని ఆయన అన్నారు.

"ఇన్ని విషాదాల్లో వైసిపి ఏడాది పాలన ఉత్సవాలా..? ఏం సాధించారని...? ఎవరికేం ఒరగబెట్టారని..?  ఇకనైనా బాధ్యతగా పనిచేయండి" అని అన్నారు. "భూములు ఇచ్చి రైతులు లాఠీ దెబ్బలు తిన్నారు... ఇది ఈ దేశ చరిత్రలోనే జరగలేదు" అని చంద్రబాబు అన్నారు.