అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఘోరపరాభవం నుంచి ఇంకా తేరుకున్నట్లు లేదని విమర్శించారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. చంద్రబాబు నిబద్దత లేని నాయకుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని చూస్తుంటే ఆయనకు ఏదో అయి ఉంటుందన్నారు. 

ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం విజయవంతంగా జరిగిందన్నారు. ఏపీ కేబినెట్ లో చారిత్రాత్మక తీర్మానాలు చేశారని కొనియాడారు. కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు జగన్‌ దిశా నిర్దేశం చేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆరోపణలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. 

ఘోరపరాభవం నుంచి చంద్రబాబు ఇంకా తేరుకోలేనట్లున్నారని అందుకే ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఏకపక్షంగా ఏ ప్రాజెక్టును నిలిపివేయలేదని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టులేవీ లేవన్నారు. 

చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సమీక్షిస్తామని జగన్‌ ఎన్నికల్లో చెప్పారని ఆ నిర్ణయానికి కట్టుబడే చర్యలు తీసుకుంటారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.