అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉండవల్లిలో గల చంద్రబాబు నివాసం ప్రైవేట్ ఆస్తియా, ప్రభుత్వ ఆస్తియా అనే సందేహం నెలకొంది. ఆ నివాసాన్ని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ నిర్మించారు. దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కట్టడంగా నిర్ధారించింది. దాంతో లింగమనేని రమేష్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు గతంలో ఆ భవనం గురించి చెప్పిన విషయానికి, ప్రస్తుతం చెబుతున్న విషయానికి మధ్య ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. అక్రమంగా ఎవరో నిర్మించిన భవనంలో ముఖ్యమంత్రి ఎలా నివాసం ఉంటారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూ వచ్చారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల విమర్శలకు చంద్రబాబు 2016 మార్చి 6వ తేదీన వివరణ ఇచ్చారు. అది ప్రభుత్వం నిర్మించిన అతిథి గృహమని ఆయన చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుందని చెప్పారు. తాను ప్రభుత్వ భవనంలోనే నివాసం ఉంటున్నానని, ప్రైవేట్ భవనంలో కాదని చెప్పారు. 

ముఖ్యమంత్రికి నివాసం లేని స్థితిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భవనంలో తాను నివాసం ఉంటున్నట్లు చంద్రబాబు అప్పట్లో చెప్పారు. అయితే, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. అది ప్రైవేట్ ఆస్తి అని, ప్రభుత్వానిది కాదని ఆయన అంటున్నారు.