కడప: నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలను తిప్పి కొట్టేందుకే తెలుగుదేశం పార్టీ ధర్మపోరాట దీక్ష పేరుతో నిరసనలు చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కడప జిల్లాలో ధర్మాపోరాట దీక్షకు హాజరైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ నెరవేర్చలేదని దుయ్యబుట్టారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ టీడీపీ ఎంపీలు అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఏపీ ప్రజల ఆవేదనను పార్లమెంట్ సాక్షిగా దేశానికి వినిపించారని ఎంపీలను కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో డిమాండ్ చేసిన అరుణ్ జైట్లీ కేంద్రం ఆర్థిక మంత్రి అయ్యాక ఆయన పోరాడిన విషయాన్నే మరచిపోయారని విమర్శించారు.   

తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని ఆదుకుంటామని హామీ ఇచ్చిన నరేంద్రమోదీ ఎన్నికలైన తర్వాత మాట తప్పారని ఎద్దేవా చేశారు. స్కాం ఇండియా కావాలంటే వైసీపీకి ఓటేయ్యండని స్కిల్ ఇండియా కావాలంటే ఎన్డీఏకు ఓటెయ్యాలంటూ పిలుపునిచ్చారని అది ఇప్పుడేమైందని ప్రశ్నించారు. 

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ వాసుల జీవనాడి. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని తెలిపారు. రూ.3100 కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు 68శాతం పూర్తైందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధి చూడాలంటే పోలవరం ప్రాజెక్టు పనులు చూడాలని సూచించారు. 

అనేక ఇబ్బందులు ఉన్నా పోలవరం సోమవారంగా మార్చుకుని ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే నదుల అనుసంధానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ పూర్తి చేసి గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేశానని తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకురాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గుర్తుంచుకోవాలని సూచించారు. గండికోట ప్రాజెక్టుకు నీరందించామని తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా 62 ప్రాజెక్టులు మెుదలుపెడితే 16 ప్రాజెక్టులు పూర్తి చేశామని వాటిని జాతికి అంకితం చేసినట్లు తెలిపారు. 15 ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. వంశధార నాగావళి, గోదావరి నాగావళి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసి కరువు అనేది రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. 

2019 మే నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి  నీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టులన్నీ పూర్తైతే మహాసంగమాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉన్నా నేటికి ఇవ్వడం లేదని ఆరోపించారు. రాబోయే డిసెంబర్ లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రికార్డు సృష్టిస్తామన్నారు. 

దేశంలో ఏదైనా జాతీయ ప్రాజెక్టు పూర్తైందంటే అది కేవలం పోలవరం ప్రాజెక్టు మాత్రమేనని స్పష్టం చేశారు. లోటుబడ్జెట్ ను పూరించేందుకు ఇవ్వాల్సిన 16వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టారని బీజేపీపై మండిపడ్డారు. హైదరాబాద్ లో కొన్ని లక్షలమంది ఉద్యోగాలు చేస్తున్నారంటే అది తాను చూసిన చొరవేనని తెలిపారు. 

ప్రతీ సంవత్సరం కేంద్రానికి పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి నిధులు వెళ్తున్నాయి. అలాంటిది కేంద్రం రాష్ట్రం అభివృద్ధికి సహకరించాల్సింది పోయి అడ్డంపడుతున్నారని మండిపడ్డారు. 2వేల 500కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 15వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఐదు రాజధానులలో ఒక రాజధానిగా ఒక ఐదు నగరాలలో అమరావతి నగరం ఒకటిగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడంలో కూడా కేంద్రప్రభుత్వం వివక్ష చూపిందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ అకౌంట్లో రూ.350కోట్లు చెల్లించి వాటిని మళ్లీ వెనక్కి తీసేసుకున్నారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినందుకే ఆ డబ్బులను వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రానికి అన్యాయం చేసిన నరేంద్రమోదీని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఎందుకు నిధులు ఇవ్వడం లేదో పునర్విభజన చట్టంలోని హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉందన్నారు. 

పెట్రో కారిడార్ కు ఇన్సెంటీవ్స్ ఇచ్చినా కేంద్రం ముందుకు రావడం లేదని చంద్రబాబు దుయ్యబుట్టారు. విజయవాడ, విశాఖపట్నం జిల్లాలకు మెట్రో రైలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విమానాశ్రయాల ఆధునీకరణకు భూములిచ్చినా వాటి ఊసెత్తడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. 

ఇకపోతే అసెంబ్లీ సీట్లు పెంచుతామని చెప్పిన కేంద్రం ఇప్పటికీ పెంచడం లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సీట్లు పెంచకపోయినా 175సీట్లు గెలిచి తమ సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పారు.