తిరుపతి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లు తేలిందన్నారు. 

రాష్ట్రంలో 20 నుంచి 22 ఎంపీ స్థానాలు సాధించి ప్రధాని ఎంపికలో కీలకపాత్ర పోషించబోతున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే బరిలో కి దిగుతుందని స్పష్టం చేశారు. 

ఓటమి భయంతోనే చంద్రబాబు వైసీపీ నవరత్నాలను, టీఆర్‌ఎస్‌ పథకాలను, పలు రాష్ట్రాల పథకాలను కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని నిలువునా దోచేసి, మేనిఫెస్టోలో 600 హామీల్లో ఒక్క హామీ కూడా అమలు చెయ్యకుండా ప్రజలను వంచించిన చంద్రబాబు మళ్లీ బాబే రావాలి అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 

చంద్రబాబు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తప్పుడు హామీలతో ప్రజల్ని మరోసారి మోసగించాలని ప్రయత్నిస్తున్నారని కోరారు. చంద్రబాబు నిజ స్వరూపం తెలిసిన చిత్తూరు జిల్లా ప్రజలు ఏనాడూ ఆయనను నమ్మలేదన్నారు. 

సొంత ఊరు, నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ప్రతికూల పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నైజాన్ని, మోసాన్ని గుర్తించి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.