చిత్తూరు: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుతో వైఎస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్‌ కుమ్మక్కయ్యారని పవన్‌ చెప్పారని, చివరకు తాము చెప్పిందే పవన్‌ కూడా ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఆ విధమైన కుమ్మక్కు రాజకీయాన్ని ఏపీ తిప్పికొట్టబోతోందని ఆయన అన్ారు. నమ్మకం లేదంటారా అని  ప్రశ్నించారు. ఇలాంటి వారిని ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, మోదీ, జగన్‌ ఏకమైనా జనం అభిప్రాయం మార్చలేరని, ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కలిసిరావాలని ఆయన అన్నారు. వైసీపీతో కలిసి టీఆర్‌ఎస్‌ ఇక్కడ పోటీ చేయవచ్చు కదా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకు, పోలవరానికి ఎందుకు అడ్డంపడ్డారని ప్రశ్నించారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వైసీపీ ఎందుకు మాట్లాడదని అడిగారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మోదీ ప్రభుత్వం పోవాలని చంద్రబాబు అన్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెబుతున్నారని అంటూ టీఆర్‌ఎస్, జగన్, మోదీ అంతా ఒకటే కదా.. హోదాపై ఎందుకు ప్రకటన చేయించరని ఆయన అడిగారు.