గుంటూరు: ఆన్ లైన్ క్లాసులకు వెళ్లే విద్యార్థులు తమదేశంలో ఉండొద్దని చెప్పడం ట్రంప్ కు తగదని టీడీపీ నేత, ఎన్నారై కోఆర్డినేటర్ బుచ్చిరామ్ ప్రసాద్ అన్నారు. కరోనా నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు ఎలా నడుస్తాయో, పాఠాలు ఎలా భోధిస్తారో ట్రంప్ చెప్పాలన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యాబోధన ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటాయన్న దేశాధ్యక్షుడు ఈ నిర్ణయాన్ని తప్పుపట్టడం భావ్యం కాదన్నారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళనపడాల్సిన పనిలేదని... ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు  కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాయాలని నిర్ణయించారన్నారు.

దాదాపు 2.50లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారని... వారందరినీ ఉన్నపళంగా స్వదేశానికి తీసుకురావడం కూడా ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని బుచ్చిరామ్ ప్రసాద్ తెలిపారు. అమెరికాలోని రాష్ట్ర విద్యార్ధుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు.

ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందని చెప్పిన ఉద్యోగులను తొలగిస్తూ నాటి సీఎస్ ఎల్వీ చర్యలు తీసుకున్నారని... దీంతో ప్రభుత్వ పెద్దలు ఆయనపై ఆగ్రహించి ఏకంగా సీఎస్ పదవినుండే తొలగించారని  బుచ్చిరామ్ ప్రసాద్ అన్నారు. ఆయన్ను చాలా అవమానకరమైన రీతిలో పదవినుండి సాగనంపారని అన్నారు.  

శుక్రవారం రాంప్రసాద్ మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హిందూమతంపై దాడిచేస్తోందని... అందులోభాగంగా పలు హిందూవ్యతిరేక చర్యలకు పాల్పడిందన్నారు. దానితోపాటే టీటీడీని అప్రతిష్టపాలుచేసేలా, తిరుమల పవిత్రతను మంటగలిపేలా కుట్రపూరిత చర్యలు చేపడుతోందన్నారు. 

read more   ఏపీలో కరోనా విజృంభణ...సీఎం జగన్ కీలక నిర్ణయాలు: కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్

టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత బోధనలు, కీర్తనలు పెట్టారని, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వాటిని తొలగించారన్నారు. హిందూమతం పై విశ్వాసం లేని, టీటీడీపై భక్తిశ్రధ్ధలు లేని సినీనటుడు  ప్రథ్వీరాజ్ ని ఎస్వీబీసీ ఛైర్మన్ గా నియమించారని, ఆయన కిందిస్థాయి ఉద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించడంతో తొలగించారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉండే వందలకోట్ల విలువచేసే టీటీడీ భూములు, స్థలాలను అమ్ముకోవాలని చూసిన వైసీపీ ప్రభుత్వం చివరకు టీడీపీ పోరాటంతో  వెనక్కు తగ్గిందన్నారు. 

టీటీడీ ముసుగులో హిందూవ్యతిరేక ధోరణిని నెమ్మదినెమ్మదిగా ప్రభుత్వం ప్రజల్లోకి చొప్పించాలని చూస్తోందని... అందుకు మరో నిదర్శనం సప్తగిరి మాసపత్రికతో పాటు క్రైస్తవ పత్రికను చందాదారులకు పంపడమేనన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న సప్తగిరి మాసపత్రికతోపాటు, చందాదారులకు క్రైస్తవ పత్రికను పంపిన ఘటనలో విచారణ పేరుతో అసలువ్యక్తులను వదిలేసి చందాదారులను వేధిస్తోందన్నారు. సప్తగిరి పత్రిక అనేది టీటీడీ విశేషాలు, హిందూమత సంప్రదాయాలు, తిరుమల శ్రీవారి విశేషాలను భక్తులకు అందిస్తుంటుందని... దానిస్థానంలో ఒంగోలుకేంద్రంగా క్రైస్తవ పత్రిక ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. ఒంగోలులో ప్రచురితమైన క్రైస్తవ పత్రిక, టీటీడీ నుంచి చందాదారులకు ఎలా వెళ్లిందో చెప్పాలన్నారు. 

శ్రీశైలంలో నకిలీ టిక్కెట్ల కుంభకోణం వెలుగుచూసి 2కోట్ల49లక్షల పైచిలుకు అవినీతి జరిగినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని బుచ్చిరామ్ ప్రసాద్ నిలదీశారు. టిక్కెట్ల కుంభకోణంపై టీడీపీ తరుపున సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఏసీబీ విచారణతో సరిపెట్టిందన్నారు. 1957లో సత్యనారాయణపురం లోని కాశీవిశ్వేశ్వర ఆలయానికి దాతలు ఇచ్చిన స్థలాన్ని నేడు అధికారపార్టీకి చెందిన కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. రూ.10కోట్ల విలువచేసే స్థలాన్ని తమకు అనుకూలమైన వేరే పీఠానికి  కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. 

25ఏళ్ల క్రితమే గజపతుల సంస్థానం నుంచి వెళ్లిపోయిన మహిళను తీసుకొచ్చి  పీ.వీ.జీ రాజు గారు స్థాపించిన మాన్సాస్ ట్రస్ట్ కు ఛైర్మన్ గా నియమించడంకూడా కుట్రలో భాగంగానే జరిగిందన్నారు. పరమతానికి చెందిన మహిళను, హిందూమతానికి చెందిన మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఎలా నియమిస్తారని టీడీపీనేత ప్రశ్నించారు.  నిజాయితీకి మారుపేరైన అశోక్ గజపతి రాజుని కాదని, పరమత అభిమానం ఉన్న మహిళను నియమించడం ఆస్తులు కొట్టేయడానికి కాదా అని ఆయన నిలదీశారు. మాన్సాస్ ట్రస్ట్ స్వాధీనంలో ఉన్న వేలకోట్ల ఆస్తులను కాజేయడానికే ప్రభుత్వం ఆ పనిచేసిందన్నారు.  

వైజాగ్ చుట్టుపక్కల, ట్రస్టుకు సంబంధించి, ప్రధాన ఆలయాల పరిధిలోని ఆస్తులను మింగేయాలన్న దురాలోచనతోనే ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న హిందూవ్యతిరేక కార్యకలాపాలను స్వామీజీలు, మఠాధిపతులు గమనించాలని రామ్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.  కోవిడ్ నిబంధనలు సడలించాక పలు మఠాల స్వామీజీలు, పీఠాధిపతులను కలిసి, ప్రభుత్వం చేస్తున్న హిందూమతవ్యతిరేక చర్యలను తెలియచేస్తానన్నారు. అన్నిపార్టీలను కలుపుకొని, హిందూమతంపై, హిందూమత ఆస్తుల కైంకర్యానికి ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు, దాడులపై పోరాటం చేస్తామని చెప్పారు.