అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యూహాన్ని రచించి, అమలు చేస్తున్నట్లే కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబును ఓడించేందుకు ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెర వెనక ఉండి సాయం అందిస్తున్నట్లు అనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ వ్యూహాన్ని పసిగట్టినట్లే ఉన్నారు. వైఎస్ జగన్ పై శనివారం చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయని అంటున్నారు. కేసీఆర్ సాయంతో జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పైగా పక్క రాష్ట్రంలో ఉండి జగన్ రాజకీయాలు చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. 

వైఎస్ జగన్ ఫిబ్రవరి 14వ తేదీన అమరావతిలో గృహ ప్రవేశం చేయాల్సి ఉండింది. అయితే, సోదరి షర్మిల అనారోగ్యం కారణంగా ఆయన దాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత ఆయన లండన్ లోని తన కూతురు వద్దకు వెళ్లనున్నారు. ఈలోగానే తెలుగుదేశం పార్టీ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని తన పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. చేరికలన్నీ హైదరాబాదులోనే జరుగుతున్నాయి. 

కేసీఆర్ సలహాలు, సూచనల ప్రకారమే జగన్ తన వ్యాహాన్ని ఖరారు చేసుకుని అమలు చేస్తున్నారనే అభిప్రాయం చంద్రబాబు మాటల్లో వ్యక్తమైంది. మరోవైపు, మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి ఆంధ్రలో పర్యటించారు. ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ ఎపిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తలసాని శ్రీనివాస యాదవ్ ద్వారా కేసీఆర్ ఆ జిల్లాల్లో కార్యాచరణకు పూనుకున్నట్లు భావిస్తున్నారు. 

పలువురు బీసీ నేతలు తలసానితో భేటీ అవుతున్నారు. దానికితోడు, తలసాని ఆధ్వర్యంలోనే బీసీ సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ జిల్లాల్లోని కాపు నేతలను, బీసీ నేతలను వైఎస్సార్ కాంగ్రెసు వైపు తిప్పే వ్యూహాన్ని తలసాని అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. అందుకే, తలసానిపై చంద్రబాబు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తలసాని తెలుగుదేశం పార్టీని వీడబోనని చెబుతూనే ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తలసాని తనకు మంచి మిత్రుడని చెప్పుకున్నారు. దీన్ని బట్టి ఎపిలో జరుగుతున్న వ్యవహారాలేమిటో అర్థమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మొత్తం మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన రాజకీయ క్షేత్రాన్ని కేసీఆర్ తీర్చిదిద్దుతున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన కేవలం మాటలకే మిగిలిపోలేదని, అది ఆచరణ రూపం దాలుస్తోందని భావిస్తున్నారు.