409 సెక్షన్ నమోదుపై వాడివేడిగా వాదనలు.. చంద్రబాబును ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న లూథ్రా..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ సందర్బంగా సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తుండగా.. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకకటేశ్వరరావు వాదనలువినిపిస్తున్నారు. ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. సెక్షన్ 409 నమోదుపై కోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన తరఫున లాయర్ ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్ చంద్రబాబు పేరు లేదు కాబట్టి సీఐడీ ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ 409 చంద్రబాబుకు వర్తించదని వాదించారు.
ఈ సమయంలో ఏఏజీ సుధాకర్ రెడ్డి.. ఈ కేసులో ఏ 35 ఘంటి వెంకట సత్య భాస్కర్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసినప్పుడు హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పారు. ఈ కేసులో 16- 3- 2023న ఏ35 విషయంలో ఈ సెక్షన్ వర్తిస్తుందని హైకోర్టు ధర్మాసనం తీర్పనిచ్చిందన్న పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే కేసులో కేసులో ఉన్న చంద్రబాబుకు సైతం 409 వర్తిస్తుందని తెలిపారు.
అయితే 2021 లో కేసు నమోదు అయితే ఇప్పటి వరకు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని సీఐడీని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు ప్రస్తావించామని కోర్టుకు సీఐడీ సిట్ తరఫు న్యాయవాదులు తెలిపారు. రిమాండ్ రిపోర్ట్ లోని పేజ్ 19 పెరా 8లో అన్ని అంశాలు పూర్తిగా పొందు పరచమని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నింధితుడిగా ఉన్న కిలారు రాజేశ్ ద్వారానే ఇదంతా జరిగిందని ఏసీపీ కోర్టుకు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కోర్టుకు 15 నిమిషాల పాటు విరామం ప్రకటించారు.
అనంతరం తిరిగి విచారణ ప్రారంభం కాగా చంద్రబాబు తరఫున లూథ్రా వాదనలు వినిపించడం ప్రారంభించారు. ఈ కేసు ఇది రాజకీయ ప్రేరేపితమని.. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబును ప్రభుత్వం టార్గెట్ చేసిందని అన్నారు. చంద్రబాబును కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఐడీ ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు లండన్ వెళ్లడం లేదని అన్నారు. ముందు రోజు రాత్రి 11 గంటలకే చంద్రబాబును చుట్టుముట్టారని తెలిపారు. వ్యక్తిని చుట్టుముట్టి కదలకుండా చేయడం హక్కుల ఉల్లంఘనేనని అన్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సీఐడీ అధికారుల కాల్ డేటాను పరిశీలిస్తే ఎప్పుడూ అరెస్ట్ చేస్తారనేది తెలుస్తోందని అన్నారు. నిబంధనల ప్రకారం దగ్గరలోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచాల్సి ఉందన్నారు. సీఐడీ నిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి అవసరం అని చెప్పారు.
ఇక, ఏసీబీ కోర్టులో వాదనలు ముగింపు దశకు చేరుకోడవడంతో న్యాయమూర్తి నిర్ణయం ఎలా వుంటుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరికొద్దిసేపట్లో వాదనలు ముగిసి కోర్టు తీర్పు వెలువడే అవకాశం వుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టు ప్రాంగణంతో పాటు విజయవాడలో భారీగా పోలీసులను మొహరించారు.