తిరుపతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేయనున్నారు. పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతి లోకసభ నియోజకవర్గం పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆ ప్రకటన చేశారు. 

టీడీపీ అన్ని పార్టీల కన్నా ముందు తిరుపతి అభ్యర్థిని ప్రకటించిన ఘనతను దక్కించుకుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిని పోటీ దించనున్నాయి. తిరుపతి లోకసభ స్థానం నుంచి 2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనా వైరస్ తో మృత్యువాత పడడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే ఏడాది ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ రిజర్డ్వ్ స్థానమైన తిరుపతి నుంచి రాష్ట్ర మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును పోటీకి దించాలని బిజెపి ఆలోచిస్తోంది. 

అయితే, తిరుపతి లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని తమకు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపిని కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం అధినేతగా తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి చిరంజీవి పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జనసేన ఆ సీటును పోటీలో భాగంగా బీఎస్పీకి వదిలేసింది.