రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి బయలుదేరిన చంద్రబాబు
దేశీయ విమానాలు ఈ రోజు రద్దు కావడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ తో కలిసి హైదరాబాదు నుంచి అమరావతికి రోడ్డుమార్గంలో బయలుదేరారు.
హైదరాబాద్ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో తన నివాసం నుంచి అమరావతికి బయల్దేరారు. రోడ్డు మార్గం ద్వారా తన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి హైదరాబాదు నుంచి బయలుదేరారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్‌తో సుమారు 65 రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయిన ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరారు.
ఏపీకి విమానాల రాకపోకలు ఇవాళ లేకపోవడంతో రోడ్డు మార్గాన ఆయన వెళ్తున్నారు. మొదట విజయవాడ మీదుగా అమరావతికి వెళ్తున్నారు. ఆయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఉన్నారు. సోమవారం గన్నవరం ఎయిర్‌పోర్టుకు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం నుంచి డొమెస్టిక్ వాహనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
మంగళవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకుని ఎల్జీ పాలిమార్స్ ఘటన బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఇవాళ సాయంత్రం వరకూ విశాఖలోనే చంద్రబాబు గడపనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు. కాగా.. విశాఖ పర్యటన అనంతరం బాబు మీడియాతో మాట్లాడనున్నారు.
ఇదిలా ఉంటే.. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం విదితమే. విశాఖపట్నం వెళ్లడానికి ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు.