అమలాపురం: ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా  బిజెపి చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీస్తోంది.  బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపుమేరకు బిజెపి నేతలు, కార్యకర్తలు శుక్రవారం అమలాపురం చేరుకోవడానికి సిద్ధపడ్డారు. వారిని పోలీసుల ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 

ఈ క్రమంలోనే బిజేపి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అమలాపురం నుండి పోలీస్ వాహనంలో గుర్తుతెలియని ప్రాంతానికి ఆయనను తరలించారు. రాత్రి 11 గంటలకు ఆయనను అరెస్ట్ చేయగా తెల్లవారేవరకు పలు పోలీస్ స్టేషన్ మార్చి తిప్పుతున్నట్లు బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డిఎక్కడున్నారో పోలీసులు ఇప్పటివరకు సమాచారమివ్వలేదు. దీంతో ఆయన జాడ తెలియడం లేదని బిజెపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వీడియో

"

మరోవైపు బిజెపి నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి వంటి ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడులో బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరిని హౌస్ అరెస్టు చేశారు. ఛలో అమలాపురం కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధపడడంతో ఆమెను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 

మాజీ మంత్రి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్ బాబును హనుమాన్ జంక్షన్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను పోలీసు స్టేషన్ కు తరలించారు. తాడేపల్లిలోని సోము వీర్రాజు నివాసానికి పెద్ద యెత్తున కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. వీర్రాజును హౌస్ అరెస్టు చేయడంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్యకర్తలు నినాదాలు చేశారు.