Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసి విలీనం: జగన్ సర్కార్ కు ఎదురయ్యే సవాళ్లు ఇవే...

ఎపిఎస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సు చేసింది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుండవచ్చు గానీ జగన్ సర్కార్ కు సవాళ్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి.

Challenges to be faced by YS Jagan govt on merger of RTC
Author
Amaravathi, First Published Sep 4, 2019, 8:12 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎన్నికల సమయంలో ఏపిఎస్ ఆర్ టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలవగానే  ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు  ఆంజనేయ రెడ్డి కమిటీని కూడా వేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ ఆంజనేయ రెడ్డి కమిటీ తన నివేదికను 3వ తేదీనాడు ప్రభుత్వానికి సమర్పించింది. ఈ విషయమై నేడు జరిగే కాబినెట్ సమావేశం అనంతరం కీలక ప్రకటన చేయనున్నారు. 

ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే హర్యానా తరువాత ప్రభుత్వమే నడుపుతున్న రోడ్డు రవాణా వ్యవస్థను కలిగి ఉన్న 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుంది. ఈ విషయమై ఉద్యోగ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. 

ఇలా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల తమ జీతాలు పెరుగుతాయని, నష్టాల ఊబిలోంచి ఆర్టీసీ బయటపడుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు సాధారణ ప్రజలు భావిస్తూ ఉండొచ్చు. కానీ ఈ విలీనం వల్ల రవాణా వ్యవస్థను  ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంలో, నిర్వహణ విషయంలో కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతాయి. 

పెరుగుతున్న ప్రజల అవసరాలకనుగుణంగా ఆర్టీసీ విస్తరిస్తుందా? విలీనం అయిన తరువాత ఉత్పన్నమయ్యే మొదటిసవాలు. ప్రస్తుత పరిస్థితుల్లో గనుక తీసుకుంటే నూటికి 95 శాతం మార్గాల్లో ప్రభుత్వరంగ సంస్థ అయినా ఆర్టీసీ బస్సులను నడుపుతుంది. విలీనం తరువాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సుల సంఖ్యను, సర్వీసులను పెంచుతుందా? 

పూర్వం గనుక మనము తీసుకుంటే, విద్య, వైద్యం అంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. ప్రైవేట్ అనే పేరే మనకు వినపడేది కాదు. మరి ఇప్పుడు పరిస్థితేంటి? పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా స్కూళ్ళు, ఆసుపత్రులు విస్తరించకపోవడంవల్ల ప్రైవేట్ ఆసుపత్రులు, స్కూళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చాయి. 

వీటి సంఖ్యా ఎంతలా పెరిగిందంటే విద్య  వైద్యం అనగానే  మనకు మొదట గుర్తొచ్చేది ప్రైవేట్ రంగమే. ఇలాంటి పరిస్థితే గనుక ప్రజా రవాణా వ్యవస్థ విషయంలో కూడా ఏర్పడితే సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాలొస్తున్నాయని కొత్త బస్సుల కొనుగోళ్ళను భారీ స్థాయిలో కుదించింది. ఒక సంస్థగా ఉన్నప్పుడే ఇలా కొనుగోళ్లను ఆపితే, ప్రభుత్వంలో విలీనమయ్యాక ఇది నేరుగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపైన భారంగా తయారవుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ కమిటీ నివేదికలో ఈ విషయమై ఎలాంటి సూచనలు చేసిందో వేచి చూడాలి. 

కొన్ని రూట్లలో ఆర్టీసీ లాభాలను సంపాదిస్తున్నప్పటికీ కొన్ని మార్గాల్లో మాత్రం ప్రజలకు రవాణా వ్యవస్థను అందుబాటులో ఉంచడం కోసం నష్టాలొస్తున్నప్పటికీ బస్సులను నడుపుతుంది. ఇలా ట్రాఫిక్ అధికంగా ఉండే రూట్లలో వచ్చిన లాభాలతో నష్టాలు వచ్చే రూట్లలో సైతం బస్సులను నడుపుతుంది. 

ఒక్కసారి ఇలా విలీనమయ్యాక ప్రభుత్వం ఇలానే బస్సులను నడపగలుగుతుందా అనే సమస్య ఉద్భవిస్తుంది. ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం, ఖర్చులను తగ్గించుకోవాలని విపరీతంగా కృషి చేస్తుంది. ఇలా ఖర్చు తగ్గింపు లో భాగంగా ఇలా నష్టాలు వచ్చే రూట్లలో బస్సులను ఆపేస్తే సామాన్యుడికి చాలా కష్టతరమవుతుంది. 

కార్మికుల విషయానికి గనుక వస్తే, విలీనమయ్యాక వారు పూర్తి స్థాయి ప్రభుత్వోద్యోగులుగా మారిపోతారు.  వారు ట్రేడ్ యూనియన్ హక్కులను కోల్పోతారు. బోనస్ లు ఉండవు. ఈ విషయాలు వారికి తెలియనివి కావు. అయినాకూడా వారు ఎందుకు ఈ విషయాన్ని స్వాగతిస్తున్నారంటే జీతాలు పెరుగుతాయి. ఆర్టీసీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా తమ జీతాల పెంపు కోసం ఉద్యమాల అవసరం ఉండదు. ప్రభుత్వోద్యోగులకు పెంచినప్పుడల్లా, తమకు కూడా జీతాలు పెరుగుతాయి అనే చిన్న ఆశ వల్ల. 

ఇవన్నీ విలీనానికి సంబంధించిన సవాళ్లు. తమ హక్కులను కోల్పోడానికి కూడా సిద్ధపడి కార్మికులు విలీనాన్ని కోరుకుంటున్నారంటే దానికి కారణం లేకపోలేదు. ఈ నిర్ణయాన్ని వారు స్వాగతించడానికి  ప్రధాన కారణం ఆర్టీసీ నష్టాల్లో ఉండడం. ఈ విషయాలు గత ప్రభుత్వాలకు తెలియవా అంటే తెలియనినివి కావు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐఐఎం బెంగళూరు సారధ్యంలో ఆర్టీసీపైన ఒక కమిటీని కూడా వేశారు. అందులో వారు ఆర్టీసీ నష్టాల్లో ఎందుకుందో తెలుపుతూ, ఆర్టీసీని లాభాల బాట ఎలా పట్టించాలో కూడా తెలిపారు. 

ట్రాఫిక్ తక్కువ ఉండే రూట్లలో నడిచే ఆర్టీసీ సర్వీసులపైన రోడ్ టాక్స్ మినహాయింపు నుంచి మొదలుకొని ఆర్టీసీ ఆస్తులను అభివృద్ధి పరచడం వరకు ఎన్నో అమూల్యమైన సూచనలు చేశారు. ఈ రిపోర్టులో వారు చేసిన మరో ముఖ్యమైన సూచనేంటంటే, ఆర్టీసీ తనకు అవసరమైన కొన్ని విడి భాగాలను తానే సొంతంగా తయారుచేసుకోవడం. ఉదాహరణకు ఆర్టీసీ ఉపయోగించే టైర్లను తానే సొంతంగా తయారుచేసుకుంటే ఎంతో డబ్బు ఆదా అవడమే కాకుండా వాటిని మార్కెట్లో కూడా అమ్మే వీలుంటుంది. ఇలా మరింత లాభాలను ఆర్జించవచ్చు. 

ఆంజనేయ రెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టు కేవలం విలీనానికి సంబంధించిన నియమాలను మాత్రమే కాకుండా ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉంటుందని, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక భారంగా కాకుండా, లాభాలను ఆర్జించిపెట్టే శాఖగా ఎదుగుతుందని ఆశిద్దాం. 

Follow Us:
Download App:
  • android
  • ios