ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల నుంచి మాజీల వరకు అందరూ వైసీపీలోకి క్యూలు కడుతున్నారు తాజాగా ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సునీల్.... ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. 

టీడీపీ నేత చలమలశెట్టి సునీల్ సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. 2014లో వైసీపీ తరపున కాకినాడ పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేసి టీడీపీ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. 

2009లో ప్రజారాజ్యంపార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు చేతిలో ఓడిపోయారు. తాజాగా 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరి మళ్లీ ఎంపీగా పోటీ చేసి వంగా గీత చేతిలో ఓడిపోయారు. 

వరుసగా మూడ సార్లు, మూడు వేర్వేరు పార్టీల నుంచి అదే కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సునీల్. గత ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీని అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న సునీల్...తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారు. 

స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన సునీల్.... 2022లో రాజ్యసభ సభ్యత్వం పొందడానికి అధికార పార్టీతో మంతనాలు జరిపారని, అందుకు ఆమోదముద్ర లభించడంతోనే ఆయన తిరిగి వైసీపీలోకి చేరుతున్నట్టు సమాచారం.