ఏపీ పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరాం: సత్యవజయతే దీక్ష తర్వాత లోకేష్
తమ కుటుంబంపై జగన్ సర్కార్ అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
న్యూఢిల్లీ:ఏపీ పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టుగా నారా లోకేష్ చెప్పారు.న్యూఢిల్లీలో సత్యమేవజయతే ఒక్క రోజు దీక్షలో సోమవారంనాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం లోకేష్ కు ఇద్దరు చిన్నారులు నిమ్మరం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 24 రోజులుగా జైలులో ఉంచారన్నారు.రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని లోకేష్ విమర్శించారు.
చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కోర్టు నిర్ణయం మేరకు తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని లోకేష్ తెలిపారు.అక్రమ కేసులను నిరసిస్తూ మోత మోగించినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని లోకేష్ విమర్శించారు.ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు అయినా తనపై కేసులు నమోదు చేశారన్నారు.ఈ కేసులో తనకు నోటీసులు ఇచ్చారని తెలిపారు.తనకు సంబంధం లేని విషయాల్లో కేసులు పెట్టడాన్ని లోకేష్ తప్పుబట్టారు.
also read:చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తా: దీక్ష విరమించిన భువనేశ్వరి
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రిలో జైలులో ఉన్నాడు. ఈ నెల 5వరకు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు కేసు విషయమై న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3న ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించనుంది.
చంద్రబాబుపై ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో పోలీసులు పీటీ వారంట్లు దాఖలు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు ఘర్షణ, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.