ఏపీ హైకోర్ట్ తరలింపుపై కేంద్రం క్లారిటీ... పార్లమెంట్ సాక్షిగా న్యాయ శాఖ కీలక ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల నిర్ణయంలో ఒకటయిన హైకోర్ట్ తరలింపుపై తాజాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ కు కేవలం ఒకే రాజధాని కాకుండా మూడు రాజధానులు ఏర్పాటుచేస్తామని వైసిపి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖ నుండి పరిపాలన సాగించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతుండగా తాజాగా హైకోర్ట్ తరలింపుపై పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఏపీ హైకోర్ట్ తరలింపుపై ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
అమరావతి నుండి హైకోర్టును కర్నూల్ కు తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్ట్ ఉమ్మడి నిర్ణయానికి రావాలని కేంద్ర న్యాయశాఖ స్పష్టం చేసింది. హైకోర్టు తరలింపుపై పూర్తిస్థాయి ప్రతిపాదనేదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో లేదన్నారు కేంద్ర మంత్రి. హైకోర్టు తరలింపుపై ఇంకా ఏపీ ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు తెలపాల్సి వుందని... ఇందుకు సంబందించిన పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి వుంటుందన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి పూర్తిస్థాయి ప్రతిపాదన పంపిస్తే కేంద్ర ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
Read More ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణం: తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం అమరావతి కేంద్రంగా ఏపీ హైకోర్టు ఏర్పాటైందని కేంద్రం పేర్కొంది. 2019 జనవరి ఒకటి నుంచి అమరావతిలో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే 2020లో హైకోర్టును అమరావతి నుండి కర్నూల్ తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించారని అన్నారు. హైకోర్టును సంప్రదించి తరలింపు నిర్ణయాన్ని రాష్ర్ట ప్రభుత్వం తీసుకోవాల్సి వుంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.