ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చెయ్యకుండా మరోసారి మొండిచేయి చూపింది. తెలంగాణ రాష్ట్రానికి వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఏపీకి మాత్రం విడుదల చెయ్యకుండా పెండింగ్ లో పెట్టింది. 

ఈ ఏడాది మార్చిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెుత్తం ఏడు వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ.50 కోట్లు చొప్పున కేంద్రం రూ.350 కోట్లను విడుదల చేసింది. ఆ తర్వాత వెంటనే ఆ నగదును వెనక్కి తీసుకుంది మోదీ ప్రభుత్వం. అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 

కేంద్రప్రభుత్వ నిర్ణయంతో షాక్ గురైన ఏపీ సర్కార్ మార్చి నెలాఖరు లోపే యూసీలు, ఖర్చుల వివరాలు అందించింది. యూసీలు, ఖర్చుల వివరాలు అందించి ఆర్నెళ్లు గడుస్తున్నా నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. 

అయితే ఏపీతోపాటు పెండింగ్ లో పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ.450కోట్లను వారం రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక, డీవోపీటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఏపీ విషయంలో ఎలాంటి పురోగతి లేదని తేల్చిచెప్పారు. 

పక్క రాష్ట్రానికి ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల విషయంలో కేంద్రం ఇంకా ఎటూ తేల్చకపోవడంపై అధికార తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

పునర్విభజన చట్టంలోని అంశాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాల్లో కేంద్రం మెుండి చెయి చూపడంతో ఆగ్రహంగా ఉన్న ఏపీ సర్కార్ మరి వెనుకబడిన జిల్లాల నిధుల కేటాయింపుల ఆలస్యంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.